సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గురువారం రాజ్‌భవన్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం రమణ, పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు,రేవంత్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, పరిశ్రమలన్నీ పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ వివాదాస్పదం అవుతున్నాయని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని విమర్శించారు. వీటిపై అసెంబ్లీలో చర్చ జరపాలని, అందుకే సభను సమావేశపరచమని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.