నర్సంపేటలో టీడీపీకి దెబ్బ | Telangana TDP Leaders In TRS Warangal | Sakshi
Sakshi News home page

నర్సంపేటలో టీడీపీకి దెబ్బ

Published Sun, Jan 13 2019 12:27 PM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Telangana TDP Leaders In TRS Warangal - Sakshi

నర్సంపేట: 30 ఏళ్లుగా క్రమశిక్షణకు మారుపేరయిన తెలుగుదేశం పార్టీలో పనిచేసి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని వీడి పలువురు టీడీపీ ముఖ్య నాయకులు సైకిల్‌ దిగి కారెక్కబోతున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరులంతా టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో పేటలో ఆ పార్టీకి కాలం చెల్లినట్లయింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నర్సంపేటలో పార్టీ బలంగా ఉండడంతో మహాకూటమి తరఫున నర్సంపేట అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం రేవూరి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరి క్షణంలో మహాకూటమి పొత్తుల్లో భాగంగా రేవూరి వరంగల్‌ పశ్చిమ అభ్యర్థిత్వం దక్కడంతో ఆయన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని వదిలి వరంగల్‌ పశ్చిమకు వలస వెళ్లారు.

అక్కడ అనూహ్యంగా రేవూరి ఓటమి పాలుకావడంతో టీడీపీ రాజకీయ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రేవూరి నర్సంపేటను వదిలివెళ్లడంతో ఎన్నికలకు ముందే దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట, ఖనాపురం మండలాలకు చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీడీపీ ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమమ్యారు.

నర్సంపేట టీడీపీలో 1987 నుంచి పనిచేసి 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ముగించుకుని, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన మాజీ మార్కెట్‌ చైర్మన్‌ ఎర్ర యాకూబ్‌రెడ్డి తన అనుచరులతో నేడు పెద్ది సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. రేవూరికి సన్నిహితులైన పుచ్చకాయల బుచ్చిరెడ్డి, కొయ్యడి సంపత్, రామగోని సుధాకర్, చిలువేరు కుమారస్వామి, కొమ్మాలు, మోతె సంపత్‌రెడ్డి, దొమ్మటి సత్యం, జనగాం వీరకుమార్, దేశిని సుదర్శన్, గోల్లెని రాజీరు, మహాదేవుని రాజవీరులు కారెక్కనున్నారు. టీడీపీ ప్రధాన నాయకులు, రేవూరి తర్వాత కార్యకర్తలకు అండగా నిలిచే నాయకులంతా టీడీపీని వీడడంతో ఇక ఆ పార్టీ నర్సంపేటలో ఖాళీ అయినట్లేనని పలువురు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement