క్షీర విప్లవం తెద్దాం | Telangana to offer subsidy for buying buffalo | Sakshi
Sakshi News home page

క్షీర విప్లవం తెద్దాం

Published Mon, Sep 18 2017 1:07 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

క్షీర విప్లవం తెద్దాం - Sakshi

క్షీర విప్లవం తెద్దాం

► రాష్ట్రంలో పాల వెల్లువ రావాలి: ముఖ్యమంత్రి కేసీఆర్‌
► పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై ఇంటింటికో గేదె
► రెండు లక్షల మంది సొసైటీ సభ్యులకు వర్తింపజేస్తాం
► ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తాం
► ఇతర రాష్ట్రాల నుంచి పాలు తెచ్చుకునే పరిస్థితి పోవాలి
► ‘విజయ’ తరహాలో మిగతా సొసైటీలకు రూ. 4 ప్రోత్సాహకం
► త్వరలోనే మరో భారీ పథకం తెస్తామని వెల్లడి
► ప్రగతి భవన్‌లో పాల ఉత్పత్తిదారులతో సమావేశం


సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగకు ముందే రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులపై వరాల జల్లు కురిపించింది. పాడి రైతుల అభివృద్ధికి త్వరలోనే భారీ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈలోపు రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు యాభై శాతం సబ్సిడీపై గేదెలను పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది పాల సొసైటీ సభ్యులందరికీ దీన్ని వర్తింపజేస్తామని, రెండు నెలల్లోనే ఈ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. విజయ డెయిరీ తరహాలో పాడి రైతులకు చెల్లిస్తున్న రూ.4 ప్రోత్సాహక ధరను కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి పాల సొసైటీలకు కూడా చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పాల ఉత్పత్తిదారులతో ఆదివారం ప్రగతిభవన్‌లోని జనహితలో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘రాష్ట్రంలో తలసరి పాల వినియోగం తక్కువగా ఉంది. ప్రజల అవసరానికి సరిపడేన్ని పాలు ఉత్పత్తి కావటం లేదు. రాష్ట్రానికి కావాల్సిన పాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం సిగ్గుచేటుగా ఉంది. అందుకే పాల ఉత్పత్తి పెరగాలి. మన రాష్ట్రంలో అవసరమయ్యే పాలన్నీ మనమే ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం 6 లక్షల లీటర్లు కరీంనగర్‌ నుంచి వస్తున్నాయి. మరో 4 లక్షలు ఆంధ్రకెళ్లి, 2 లక్షలు గుజ్‌రాత్‌ నుంచి వస్తున్నాయి. మనకు రైతులు లేరా..? సబ్సిడీ మీద గేదెలు కొనిస్తే పాలు ఉత్పత్తి చేయలేరా..? అందుకే ప్రభుత్వం తరపున రెండు పనులు చేస్తాం.. పాల సొసైటీల్లో ప్రస్తుతం రెండు లక్షల మంది రైతులున్నారు. 50 శాతం సబ్సిడీపై ఇంటికో గేదె కొనిస్తా. దాంతో పాల వెల్లువ వచ్చి ఉత్పత్తి పెరగాలే. రెండు నెలల్లో అందరం గేదెలు కొనాలే. ఎవరి గేదెలను వాళ్లే సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇప్పట్నుంచి సర్కారు సెలెక్ట్‌ చేయదు. మీకు నచ్చినవి మీరే కొనుగోలు చేయాలి. దీని ధర రూ.55 వేలు అయితే.. సగం రైతులు కట్టాలి. మిగతా సగం సొసైటీ చైర్మన్లు చెల్లిస్తారు.

రెండు నెలల్లోపల ఆ డబ్బులు మంజూరు చేస్తాం. ఆరునెలల నాటికో.. ఎనిమిది నెలలకో మళ్లీ మిమ్మల్ని పిలుచుకుంటాం. అప్పటికి 10 లక్షల లీటర్లు పోస్తున్నాం సార్‌.. అని చెప్పే పరిస్థితి రావాలి. క్షీర విప్లవానికి ఇక్కణ్నుంచే తొలి అడుగు వేద్దాం. ఇదేం వట్టిగా కాదు. దాదాపు నాలుదైదు వందల కోట్లు కావాలి. నేను ఎక్కడన్న తిప్పలు పడుతా. కొంత దుబారా ఖర్చు తగ్గించి మీకు అవసరమైన నిధులు సమకూరుస్తా. నెల రోజుల్లోనే చైర్మన్లకు నిధులు విడుదల చేస్తాం. మిగతా సగం డబ్బులు మీరు జమ చేసుకొని గేదెలు కొనుక్కొండి. దీంతో లాభం జరుగుతది. ఎస్సీలు, ఎస్టీ రైతులు పేదోళ్లుంటారు. వారికి 75 శాతం సబ్సిడీ ఇద్దాం...’’అని చెప్పారు.

మిగతా సొసైటీలకు ప్రోత్సాహక ధర
‘‘పాల సేకరణకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం మాదిరి విజయ డెయిరీకి లీటర్‌కు రూ.4 ప్రోత్సాహక ధర చెల్లిస్తున్నాం. విజయ డెయిరీకి ఇచ్చేనట్లే నల్లగొండ సొసైటీకి ఇవ్వాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి నావెంట పడుతున్నారు. వచ్చే వారం నుంచి విజయ డెయిరీ తరహాలోనే నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి సొసైటీలకు రూ.4 చెల్లిస్తాం. దసరా లోపే ఇస్తాం. ఈ నెల 24 వరకు చెల్లిస్తాం. రైతులందరూ చక్కగా పాడి పశువులను పెంచుకోవాలి. సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలి’’అని సీఎం అన్నారు.

ఇంతటితో ఆగేది లేదు..
పాడి రైతుల కోసం త్వరలో మరో భారీ పథకం తెస్తామని సీఎం తెలిపారు. ‘‘ఇంతటితో ఆగేది లేదు. ఇంకా పెద్దగా ఆలోచన చేస్తున్నా. గొర్రెల విషయంలో పెద్దఎత్తున ఎలా చేశామో.. రాష్ట్రంలో క్షీర విప్లవం తెచ్చేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు ఒక పెద్ద స్కీమ్‌ తీసుకువచ్చే ఆలోచన ఉంది. గొర్రెల పంపిణీకి రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అలాగే పాల ఉత్పత్తిపై దృష్టి పెడతాం. పాల ఉత్పత్తి పెంచితే సరిపోదు. అంతమేరకు సేకరించి, సరఫరా చేసే శక్తి సామర్థ్యాలుండాలి. డెయిరీలను విస్తరించాలి. ఎక్కువ పాలు వస్తే దాన్ని పొడిచేసి నిల్వ చేయాలి. మిషన్లు తీసుకురావాలి. పెద్ద పథకం తీసుకువస్తే పశువులొక్కటే కాదు.. చాప్‌ కట్టర్స్, గడ్డి కోసే మిషన్లు, ఇవన్నీ పకడ్బందీగా చేయాలి. ఈ స్కీమ్‌కు నేనే డిజైన్‌ చేస్తా’’అని వివరించారు.

మొక్కలు పెంచకుంటే నా మీద ఒట్టే..
ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటాలని పాడి రైతులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రంలో 2 లక్షల మంది పాల సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారు. నాదొక్కటే కోరిక. మీకు ఇంటికి ఆరు చొప్పున మొక్కలు సరఫరా చేస్తాం. అంటే పన్నెండు లక్షల చెట్లు. తప్పనిసరిగా ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలే. ఇంట్లో ఆరుగురుంటే ఒక్కొక్కదానికి ఒక్కరి పేరు పెట్టాలె. ఏ పేరు ఉన్నోళ్లు వాళ్లే.. ఓ జగ్గెడు నీళ్లు పోయాలె. చెట్టు పోతే.. ఇగ నేను పోయినా అనుకోవాలె... అంత పక్కాగా మొక్కలు పెంచండి.. మనం మన పిల్లకు ఎంత ధనం సంపాదించి ఇచ్చినా లాభం లేదు. భవిష్యత్‌లో వాళ్లు బతికే వాతావరణం ఉండాలి.. అందుకే మొక్కలు పెంచాలి. పెంచకపోతే నా మీద ఒట్టే..’

సీఎంకు కృతజ్ఞతల వెల్లువ
సీఎం ప్రకటించిన హామీలతో జనహితకు తరలివచ్చిన సొసైటీల చైర్మన్లు, రైతులు చప్పట్ల కేరింతలతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలు రైతులకు బాసటగా ఉన్నాయని నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల సొసైటీల అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. పాల ప్రోత్సాహక ధరపై సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల యువ తెలంగాణ జేఏసీ చైర్మన్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.  

ఇంతటితో ఆగేది లేదు. ఇంకా పెద్దగా ఆలోచన చేస్తున్నా.  రాష్ట్రంలో క్షీర విప్లవం తెచ్చేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు ఒక పెద్ద స్కీమ్‌ తీసుకువచ్చే ఆలోచన ఉంది. పాలను సేకరించి, సరఫరా చేసే శక్తి సామర్థ్యాలుండాలి. పశువులొక్కటే కాదు.. గడ్డికోసే మెషీన్లు, తదితరాలన్నీ పకడ్బందీగా చేయాలి. ఈ స్కీమ్‌కు నేనే డిజైన్‌ చేస్తా. – కేసీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement