
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో సంస్క రణలు అనూహ్య ఫలితాలు ఇవ్వడమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ–నామ్ పథకం అమలులో ఎన్నో మైలురాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ–నామ్‌తోపాటు ఈ–నామ్‌యేతర వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనూ ఆర్థిక లావాదేవీలు పెం పొందించుకున్నట్లైతే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. మంగళవారం తెలంగాణ, ఏపీలలో ఈ–నామ్ వ్యవస్థ, వ్యవసాయ, ఉద్యానోత్పత్తుల కొనుగోళ్లపై జరిగిన అంతర్రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు.
ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మూడేళ్లకాలంలో 47 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 22 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయోత్పత్తుల విక్రయాలు జరగడం ద్వారా రూ.9 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. ఈ–నామ్ అమలవుతున్న మార్కెట్లలో లైసెన్సింగ్ విధానం, మోడల్ యాక్ట్, నిబంధనలు, లావాదేవీలు వంటి అంశాలపై వర్తకులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ, ఏపీల్లో 64 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలవుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్రాల మధ్య వ్యాపారం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో 22 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలవుతోందని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ వెల్లడించారు.