తెయూ సీఓఈ సస్పెన్షన్
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి (సీఓఈ) డాక్టర్ మామిడాల ప్రవీణ్‌ను సస్పెండ్ చేస్తూ గత ఇన్‌చార్జి వీసీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చే సిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వర్సీటీవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 2014 జనవరి నాలుగున కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వర్సి టీలో పలువురు శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరారు. వారితోపాటు ఎంపికైన ప్రవీణ్ పది రోజుల తర్వాత
తెయూ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనను పరీక్షల నియంత్రణాధికారిగా నియమిస్తూ జూలై ఎనిమిదిన అప్పటి ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధర్మరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెయూలో చేరక ముందు డాక్టర్ ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఇక్కడ చేరిన తర్వాత ఓయూలో వెంటనే రాజీ నామా చేయలేదని సమాచారం.
ఇక్కడా, అక్కడా వేతనం పొందినట్లు తెలిసింది. ఒకే సమయంలో రెండు యూనివర్సిటీల్లో వేతనాలు పొందినట్లు అందిన ఫిర్యాదు మేరకు గత నెల 16న ప్రవీణ్‌ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి శనివారం వెలుగు చూశాయి. అప్పటి నుంచి సెలవులో వెళ్లిన ప్రవీణ్, సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరింపజేసుకునేందుకు ఉన్నత విద్యామండలితోపాటు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ప్రొబేషనరీ సమయంలో ఉన్న ప్రవీణ్ ఉద్దేశ పూర్వకంగా రెండు చోట్ల వేతనాలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
పీహెచ్‌డీ తెలుగు అడ్మిషన్లు రద్దు
తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్‌డీ తెలుగు విభాగం అడ్మిషన్లను రద్దు చేస్తూ గత ఇన్‌చార్జి వీసీ శైలజా రామయ్యార్ డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా ఆల స్యంగా వెలుగు చూసింది. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు అప్పుడు ఫిర్యా దు చేశారు. దీంతో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏక సభ్య కమిటీగా నియమించారు.
ఆయన విచారణ జరిపి నివేదికను ఇన్‌చార్జి వీసీకి అందజేశారు. అనంతరం అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చిన వీసీ, ఆర్ట్స్ డీన్ ధర్మరాజు, తెలుగు హెచ్‌ఓడీ కనకయ్యలకు చార్జ్ మెమో లు జారీ చే శారు. అడ్మిషన్లను రద్దు చేశారు. ఈ విషయమై వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ లింబాద్రిని సంప్రదించగా ఉత్తర్వులు అందిన మాట వాస్తమేనని తెలిపారు.