సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి ఏటా హజ్ యాత్రకు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కోటాను పెంచాలని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ కోరారు. బుధవారం ఈ మేరకు ఢిల్లీలో ఆయన కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 2018 హజ్ యాత్రకు దాదాపు 18 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
అయితే కేంద్ర హజ్ కమిటీ రాష్ట్రానికి 4 వేల కోటా మాత్రమే కేటాయించడంతో దరఖాస్తు చేసుకున్న మిగతా 14 వేల మందికి నిరాశే మిగిలిందని మంత్రికి వివరించినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా రాష్ట్రం నుంచే దరఖాస్తులు వచ్చాయని, ఇతర రాష్ట్రాల్లో మిగిలిన కోటా ఉంటే తెలంగాణకివ్వాలని కోరామన్నారు. ఈ విషయమై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment