నేటి నుంచి 'తెలంగాణ వైభవం' | Telangana Vaibhavam Starts From Today In Karimnagar District | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 'తెలంగాణ వైభవం'

Published Fri, Sep 20 2019 11:25 AM | Last Updated on Fri, Sep 20 2019 11:25 AM

Telangana Vaibhavam Starts From Today In Karimnagar District - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ఏ జాతి మనుగడైనా దాని చారిత్రక, సాంస్కృతిక పునాదులపైనే ఆధారపడి ఉంటుందనేనది కాదనలేని వాస్తవం. చరిత్ర విస్మరించిన జాతి ఉనికి కోల్పోతుందనేది అంతే తిరుగులేని నిజం. విభిన్న సంస్కృతులకు, ఆచార వ్యవహారాలు తెలంగాణ ప్రాంతానికి విశేష ఆభరణాలు. కళలు, ప్రజాజీవన శైలి, సాంస్కృతిక రూపాలు వైవిధ్యమైన ఆచార, సంప్రదాయాలు ఈ ప్రాంతానికి పెట్టని సుగుణాలు. 

తెలంగాణ వైభవం..
కనుమరుగైన చరిత్రను శాస్త్రీయంగా పరిశోధించి, సిసలైన ఇతిహాసాన్ని భావి తరాలకు అందించేందుకు ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ వైభవం’ పేరిట మూడు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్‌లోని మానేరు బ్రిడ్జి సమీపంలోని కొండా సత్యలక్ష్మి గార్డెన్‌ ఈ వైభవానికి వేదికగా మారింది. విశ్లేషకులు, విశిష్ట వ్యక్తులు, ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారి విస్తృత ప్రసంగాల ద్వారా నిజమైన చరిత్రను రేపటి తరానికి అందించనున్నట్లు నిర్వాహకులు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్‌. రాజభాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి.నిరంజనాచారి తెలిపారు.

ఇవీ చర్చనీయాంశాలు
తెలంగాణ చారిత్రక వైభవం, కావ్యం, పురాణ ఇతిహాసాలు, శాస్త్ర, సాహిత్య గ్రంథాలు, పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, జాతరలు, వాస్తు శిల్పం, నగర నిర్మాణ ప్రణాళికలు, జల వినియోగం, ప్రదర్శన కళా ప్రక్రియలు, ప్రయోజనాలు, చేనేత నైపుణ్యాలు, రత్నాలు, పగడాలు, నిల్వ ఉంచే ఆహార పదార్థాలు, ప్రాచీన కాలంలో వెల్లి విరిసిన నౌకానిర్మాణం, నౌకాయానం, తెలంగాణ స్వాతంత్రోద్యమం తదితర అంశాలపై సాధికార ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజు చర్చల తరువాత తెలంగాణ కళలు, సాంస్కృతిక, జానపద కళారూపాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.

ఇదీ కార్యక్రమ అనుసారిణి..
తొలిరోజు శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సదస్సు ప్రారంభమవుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌ విశిష్ట అతిథిగా హాజరవుతారు. అతిథులు ప్రసంగాల అనంతరం కాకతీయుల కాలంలో యుద్ధ సన్నాహక ప్రేరేపిత నృత్య రూపకం పేరిణీ శివతాండవం ప్రదర్శిస్తారు. రెండో రోజు శనివారం ప్రాచీన తెలంగాణ వైభవంపై సదస్సు నిర్వహిస్తారు. చరిత్ర, సాహిత్య, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలుంటాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. డాక్టర్‌ సాగి కమలాకరశర్మ, డాక్టర్‌ సంగనభట్ల నర్సయ్య, డాక్టర్‌ భాస్కర్‌యోగి, డాక్టర్‌ మనోహరి, ప్రొఫెసర్లు ఎల్లప్రెగడ సుదర్శన్‌రావు, కేపీ రావు డాక్టర్‌ గిరిజామనోహర్‌ బాబు, తదితరుల ప్రసంగాలుంటాయి.

అనంతరం కవి గండ్ర లక్ష్మణ్‌రావు సారథ్యంలో కవి సమ్మేళనం, ప్రతాప రుద్రీయం నాటక ప్రదర్శన ఉంటుంది. మూడో రోజు ఆదివారం జానపద, సాహిత్య, సంస్కృతులపై ప్రసంగాలు ఏర్పాటు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారు. డాక్టర్‌ బండారు ఉమామహేశ్వర్‌రావు, ప్రొఫెసర్‌ పాండురంగారావు, సూర్యధనుంజయ్, డాక్టర్‌ శంకర్‌రావు, డాక్టర్‌ వడ్లూరి ఆంజనేయరావు ప్రొఫెసర్లు కె.యాదగిరి, డాక్టర్‌ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగాలుంటాయి. సాయంత్రం ముగింపు సమావేశంలో ఎంపీ బండి సంజయ్,  ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తదితరులు హాజరవుతారు.

సత్యమైన చరిత్ర కోసం..
నిజమైన చరిత్ర ఈ తరానికి తెలియాలి. పాలకుల ప్రభావంతో రాయబడిందే చరిత్రగా భావిస్తున్నాం. పరిశోధకులు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించగలిగిన తెలంగాణ చరిత్రను కళ్లముందుకు తెస్తున్నాం. ఇతిహాసాల ఆధారంగా లభించిన ఆనవాళ్లు, సాక్ష్యాలతో నేటి తరానికి ఆనాటి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక సంపదను పరిచయం చేయబోతున్నాం.
– డాక్టర్‌ ఎల్‌. విజయభాస్కర్‌రెడ్డి, ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణ ప్రజల పండుగ
తెలంగాణ సంస్కృతి మిగిలిన ప్రాంతాలతో పోల్చితే పూర్తి భిన్నమైనది. సుమారు రెండున్నర వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానిది. ఇప్పటి వరకు మన దృష్టికి రాని చరిత్రను వెలికితీసి ఈ సదస్సుల రూపంలో అందిస్తున్నాం. ఎనిమిది సదస్సులు, మనదైన సంస్కృతి రూపాల ప్రదర్శన ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రజల పండుగలా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అందరూ రండి. అసలైన చరిత్రను ఆస్వాదించండి.                          
 – గిరిధర్‌ మామిడి, సీఏ, నిర్వాహక కార్యదర్శి, ప్రజ్ఞాభారతి రాష్ట్రశాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement