
మక్తల్ ఎంపీడీఓతో పాటు కార్యదర్శులకు ఆన్‌లైన్‌లోనే యాప్ పై శిక్షణ
నారాయణ పేట: లాక్‌డౌన్ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా టీ కన్సల్ట్ ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సమగ్ర టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ కన్సల్ట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును శ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రారంభించి కలెక్టర్ దాసరి హరిచందనకు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేస్తూ శ్రీకారం చుట్టారు.
టీటా నేతృత్వంలో..
జిల్లాలో ఇప్పటికే టీటా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో తమ జిల్లాలో టెలీమెడిసిన్ సేవలు ప్రవేశపెట్టాలని కలెక్టర్ హరిచందన టీటా గ్లోబల్ ప్రసిడెంట్ సందీప్‌కుమార్‌ను కోరడంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రయోగాత్మకంగా..
రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను అందించేందుకు టెలీ మెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మండలంలో 39 గ్రామాలు ఉండగా.. అందులో ఇదివరకు 17 గ్రామాల్లో సేవలు కొనసాగుతున్నాయి.
వైద్య సేవలు ఇలా..
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో వ్యక్తులు బయటికి రావొద్దని ఆదేశాలు ఉండటంతో వాటిని గౌరవించడంతో పాటుగా మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా చేరువ కానున్నాయి. టెలీమెడిసిన్ సేవలు అందించడంలో భాగంగా ఆన్‌లైన్ విధానం ద్వారా సంబంధిత ప్రత్యేక అధికారులు తమ అందుబాటులోని సమయం పేర్కొంటారు. దానికి అనుగుణంగా ప్రజలు అపాయింట్‌మెంట్ పొందుతారు. అనంతంర సంబంధిత డాక్టర్, గ్రామస్తుడు ఆన్‌లైన్ ద్వారా కన్సల్ట్ అవుతారు. వీరిద్దరి మధ్య జరిగిన టెలీ మెడిసిన్ ప్రక్రియ అనంతరం ప్రిస్కిప్షన్ సైతం ఆన్‌లైన్ ద్వారా సంబంధిత గ్రామస్తులకు వాట్సాప్ ద్వారా చేరుతుంది. నోడల్‌అధికారి పంచాయతీ కార్యాలయంలో ఉంటూ సేవలు అందిస్తారు. ఈ వీడియో కనెక్ట్ ప్రక్రియకు సమన్వయం చేస్తారు.
క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయంతో..
దేశంలోనే పూర్తిస్థాయిలో మొదటిసారిగా ఒక మండలాన్ని టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పంచాయతీ కార్యాలయం నోడల్ కార్యాలయంగా ఉండగా.. పంచాయతీ కార్యదర్శి నోడల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు.
అందుబాటులో
96 మంది డాక్టర్లు
వివిధ రోగాలను ప్రజలకు ఆన్‌లైన్‌లో నివృత్తి చేస్తూ.. వైద్య సేవలను అందించేందుకు 96 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్, డెంటిస్ట్, న్యూరాలజిస్ట్, ఈఎన్‌టీ, కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, డయాబెటిస్, గ్రాస్టాలజిస్ట్, తదితర ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు.
జిల్లా అంతటా విస్తరింపజేస్తాం..
మక్తల్ మండలంలో ప్రాజెక్టు ఫలితాలు అధ్యయనం చేసిన తర్వాత జిల్లాలోని మిగతా 10 మండలాల్లో విస్తరింపజేసేందుకు కృషిచేస్తాం. మక్తల్ ప్రజలు ఈ సేవలు అందుకునేందకు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలి. కరోనా నియంత్రణకు ఇంటినుంచి బయటికి రాకుండా ప్రతిఒక్కరూ సహకరించాలి. లాక్‌డౌన్ సమయంలో ఈ సేవలు చాలా ప్రయోజనకరంగా ఉంది.
– హరిచందన, కలెక్టర్, నారాయణపేట
ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా..
లాక్‌డౌన్‌లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా టెలీ మెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మక్తల్ మండలంలో 250 మందికి వైద్య సేవలను అందించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పల్లె సీమల్లోని ప్రజలకు ఈ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం.
– సందీప్ కుమార్ మక్తాల, టీటీ గ్లోబల్ ప్రసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment