ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి భారీగా స్వస్థలాలకు పయనం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు తరలివెళ్లిన వారి సంఖ్య 20 లక్షలకు పైనే
బస్సులు, రైళ్లతో పాటు పెద్ద సంఖ్యలో వ్యక్తిగత, రవాణా వాహనాలు
అదనపు చార్జీల బాదుడుతో తప్పని ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: నిత్యం కిటకిటలాడుతూ ఉండే హైదరాబాద్ మహా నగరం పల్లెలకు తరలివెళ్లింది. సంక్రాంతి పండుగ సంబరాలకోసం సుమారు 20 లక్షల మందికి పైగా నగర వాసులు సొంత ఊళ్లకు వెళ్లారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో స్వస్థలాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గత మూడు రోజులుగా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడాయి. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్స్ కార్లు, ఇతర వాహనాల్లోనూ జనం తరలివెళ్లారు. మొత్తంగా ఈ మూడు రోజుల్లో సుమారు 20 లక్షల మందికి పైగా ఊళ్లకు వెళ్లారు. ముఖ్యంగా విజయవాడ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వెళ్లడం గమనార్హం.
తప్పని ఇబ్బందులు
రైళ్లలో రిజర్వేషన్ సీట్లు దొరకకపోవడంతో చాలా మంది దూర ప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లలో, జనరల్ బోగీల్లో వెళ్లాల్సి వచ్చింది. బస్సులను ఆశ్రయించినవారికీ ఇబ్బందులు తప్పలేదు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయగా..ప్రైవేటు బస్సులైతే డబుల్ చార్జీలు వసూలుచేశాయి. విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దక్షిణ మధ్య రైల్వే 70 రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. రద్దీ మార్గాల్లో అదనపు బోగీలను ఏర్పాటు చేసింది. ఇక జంట నగరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 5,560 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
లక్షలాది వాహనాల్లో..
* హైదరాబాద్ చుట్టూ ప్రధాన రహదారులపై ఉన్న టోల్‌గేట్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 11, 12, 13వ తేదీల్లో వెళ్లిన వాహనాల సంఖ్య దాదాపు రెండు లక్షలు. ఇందులో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 11,160. ఈ బస్సుల్లో సగటున 50 మంది ప్రయాణికుల చొప్పున 5,58,000 మంది వెళ్లారు.
* మిగతా వ్యక్తిగత వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోల వంటి వాటిలో దాదాపు 6.92 లక్షల మంది ఊళ్లకు వెళ్లారు.
* హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి రోజు 20 వేల వాహనాలు వెళుతుండగా.. గత మూడు రోజుల్లో అదనంగా మరో 25 వేల వాహనాలు వెళ్లాయి. కర్నూలు వైపు ప్రతి రోజు 14 వేల వాహనాలు వెళతాయి. గత మూడు రోజుల్లో అదనంగా మరో పదివేల వాహనాలు వెళ్లాయి. వరంగల్ వైపు ప్రతి రోజూ వెళ్లే 12 వేల వాహనాలకు అదనంగా ఈ మూడు రోజుల్లో ఐదు వేల వాహనాలు వెళ్లాయి. సిద్ధిపేట వైపు రోజూ వెళ్లే ఆరువేల వాహనాలకు అదనంగా 1,500 వాహనాలు వెళ్లాయి.
* జంట నగరాల నుంచి రైళ్లలో మూడు రోజుల్లో 7.5 లక్షల మంది ప్రయాణికులు వారి స్వస్థలాలకు వెళ్లారు.
* హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు తరలి వెళ్లిన నగర వాసులు సుమారు 20 లక్షలకు పైగానేనని అంచనా.