సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్)’ ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థి రోహన్ పురోహిత్ 690 మార్కులతో రెండో ర్యాంకు, వరుణ్ ముప్పిడి 685 మార్కులతో 6వ ర్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంకడాల అనిరు«ధ్‌బాబు 680 మార్కు లతో 8వ ర్యాంకు సాధించారు. టాప్–50లో తెలంగాణ విద్యార్థులు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐదుగురికి చోటు లభించడం గమ నార్హం. మొత్తంగా జాతీయ స్థాయిలో బిహార్ విద్యార్థిని కల్పనాకుమారి 691 మార్కులతో ఒకటో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన హిమాన్షు శర్మ 690 మార్కులతో రెండో స్థానంలో, ఢిల్లీకే చెందిన ఆరోశ్ ధమిజ, రాజస్థాన్‌కు చెందిన ప్రిన్స్ చౌదరిలు 686 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.
తెలంగాణ, ఏపీ నుంచి 66,044 మంది..
జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మే 6న నీట్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 12,69,922 మంది పరీక్ష రాశారు. ఇందులో 7,14,562 మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో 3,12,399 మంది బాలురు, 4,02,162 మంది బాలికలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఉత్తీర్ణుల్లో తెలుగు రాష్ట్రాల వారు 66,044 మంది ఉన్నారు.
జూలైలో నోటిఫికేషన్
నీట్ ర్యాంకుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయాలు ప్రత్యేక మెరిట్ జాబితాలను రూపొందించుకుని.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను భర్తీ చేసుకుంటాయి. ఈ మేరకు రాష్ట్రంలో జూలైలో వైద్య విద్య డిగ్రీ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. 2018–19 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి 3,500 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఎనిమిది ప్రభుత్వ కాలేజీల్లో 1,250 సీట్లు, 16 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో కలిపి 2,250 సీట్లు ఉన్నాయి. ఇక ఏకైక ప్రభుత్వ బీడీఎస్ కాలేజీలో వంద సీట్లు, 12 ప్రైవేటు కాలేజీల్లో కలిపి 1,040 సీట్లు ఉన్నాయి. భారత వైద్య విద్యా మండలి (ఎంసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సీట్ల భర్తీ ప్రక్రియ జరగనుంది.
నీట్ రాసిన, ఉత్తీర్ణులైన వారి వివరాలు..
రాష్ట్రం హాజరు ఉత్తీర్ణత
తెలంగాణ 44,877 30,912
ఆంధ్రప్రదేశ్ 49,253 35,732
దేశవ్యాప్తంగా 12,69,922 7,14,562
‘నీట్’ఫలితం ఆపాలన్న పిటిషన్ తిరస్కరణ
‘నీట్’ప్రశ్నపత్రాలు లీకయ్యాయని.. అందువల్ల ఫలితాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాల కొరత ఏర్పడిందని, అందువల్ల పేపర్లు లీకైనట్టు స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే ప్రశ్నపత్రాల పంపిణీలో తొలుత కొంత గందరగోళం నెలకొందని, వెంటనే దానిని పరిష్కరించామని.. పేపర్లు లీక్ కాలేదని సీబీఎస్‌ఈ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇక మే 6న పరీక్ష జరిగితే.. ఇప్పుడెందుకు పిటిషన్ దాఖలు చేశారని పిటిషనర్లను కోర్టు నిలదీసింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
గరిష్ట వయోపరిమితిపై కేంద్రానికి నోటీసులు
‘నీట్’రాసే జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 170 మంది విద్యార్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్రంతోపాటు, సీబీఎస్‌ఈ, కేరళ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను జూలై 10కి వాయిదా వేసింది.
కార్డియాలజిస్టు అవుతా..
‘‘మా నాన్న కార్డియాలజిస్ట్. అమ్మ డెర్మటాలజిస్ట్. వారిద్దరూ డాక్టర్లే కావడంతో చిన్నప్పటి నుంచే నాకు కూడా డాక్టర్ కావాలనేది కోరిక. తల్లిదండ్రులు చూపిన మార్గం, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఆలిండియా రెండో ర్యాంకు సాధించగలిగా. నేను కూడా కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా..’’ – రోహన్ పురోహిత్, 2వ ర్యాంకు
న్యూరోసర్జన్ కావాలని ఉంది
‘‘చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది కోరిక. జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న శ్రీనివాసరెడ్డి బిజినెస్‌మన్, అమ్మ ఆర్తిరెడ్డి ఎకనామిస్ట్. వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించా. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తా. భవిష్యత్తులో మంచి న్యూరోసర్జన్ కావాలనేది నా ఆశయం..’’ – వరుణ్ ముప్పిడి, 6వ ర్యాంకు
మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటా..
‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోసమాల. అమ్మ రమాదేవి, నాన్న తేజేశ్వర్ ఇద్దరూ ఉపాధ్యాయులే. వారి ప్రోత్సాహంతోనే జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించగలిగాను. భవిష్యత్తులో మంచి డాక్టర్‌గా పేరుపొందాలనేది నా లక్ష్యం..’’ – ఎ.అనిరుధ్‌బాబు, 8వ ర్యాంకు
Comments
Please login to add a commentAdd a comment