సాక్షి, హైదరాబాద్: వేకువజామునే సుప్రభాత సేవలు.. దైవ నామస్మరణలు, ఘంటానాదాలు, హారతులు, భక్తుల ప్రదక్షిణలు, మొక్కులు, తీర్థ ప్రసాదాల వితరణ. దేవాలయాల్లో నిత్యం మనకు వినిపించే, కనిపించే సన్నివేశాలివి. కానీ లాక్‌డౌన్‌తో దాదాపు రెండున్నర నెలలుగా మూతపడి ప్రభుత్వ తాజా సడలింపులతో ఈ నెల 8 నుంచి తెరుచుకోనున్న ఆలయాల్లో ఈ సందడికి బ్రేక్ పడనుంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ గుడిలోని మూలవిరాట్టును దర్శించుకొని వెళ్లిపోవడమే కొంతకాలంపాటు నిత్యకృత్యం కానుంది. తీర్థప్రసాదాలే కాదు.. చివరకు ఘంటా నాదం, శఠగోప ఆశీర్వచనాలనూ నిర్వహించ వీల్లేని అనివార్య పరిస్థితి ఎదురుకానుంది.
మార్గదర్శకాలు ఇవీ..
► దేవాదాయ శాఖ పరిధిలోని 100 ప్రధాన దేవాలయాలన్నింటికీ ప్రభుత్వం థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు సరఫరా చేస్తోంది. భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండే మిగతా ఆలయాల్లో కమిటీలే వాటిని కొనుగోలు చేసుకోవాలి.
► ఆలయాలకు వచ్చే భక్తుల్లో జ్వర లక్షణాలుంటే ప్రవేశం ఉండదు.
► 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలకు కూడా ప్రవేశం లేదు. మిగతా భక్తులు పరిమిత సంఖ్యలో భౌతికదూరం పాటిస్తూ ఆలయంలోకి వెళ్లాలి.
► పార్కింగ్ కేంద్రాల్లోనే చెప్పులు వదిలేయాల్సి ఉంటుంది.
► ఆలయ ప్రవేశద్వారాం వద్ద చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసి దేవుడికి నమస్కరించి నిష్క్రమించాలి.
► తీర్థ, ప్రసాదాలు, శఠగోపం ఉండదు. నివేదించేందుకు ఇంటి నుంచి నైవేద్యాలు తెస్తే అనుమతించరు.
► కొబ్బరికాయ కూడా కొట్టడం నిషేధం.
► ఆలయాల్లో అన్నదానాలు కూడా పాత పద్ధతిలో కుదరదు. దాని బదులు సంతర్పణ పదార్థాలను ప్యాకెట్లలో ఉంచి అందించొచ్చు.
► దేవాలయాల సమీపంలో ఉండే దుకాణాల్లో అమ్మే ప్రసాదాలకు అనుమతి ఉంటుంది.
► గుళ్లలో భక్తి పాటలు పాడే అవకాశం కూడా లేదు. సంగీత విభావరిలు నిర్వహించరాదు. కానీ రికార్డుల ద్వారా భక్తి పాటలు వినిపించవచ్చు.
► పెద్ద దేవాలయాల్లో భక్తులు విడిది చేసేందుకు ఉండే వసతి గృహాలను ప్రస్తుతానికి మూసే ఉంచుతారు.
► పుష్కరుణులు, కోనేరుల్లో స్నానాలకు అనుమతించరు.
► తలనీలాల సమర్పణ కూడా నిషేధం.
► ఆలయాలకు చెందిన కల్యాణ మండపాలు కూడా మూసే ఉంటాయి. వాటిని అద్దెకివ్వరు.
వారంపాటు అమలు..
లాక్‌డౌన్ మినహాయింపుల్లో భాగంగా సోమవారం నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడం తో రాష్ట్రంలోనూ ఆలయాల్లో దర్శనాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దండంతో సరిపెట్టుకునేలా నిబంధనలు ఏర్పాటు చేసింది. సీఎం నుంచి అనుమతి నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో చర్చించి దేవాలయా లు తిరిగి తెరిచేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విధానాన్ని వారంపాటు అమలు చేసి చూడనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులొస్తే మరిన్ని మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఆలయాలు తెరిచిన తర్వాత కరోనా కేసుల వేగం పెరిగితే ఆలయాలపై మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. చాలా కాలం తర్వాత దేవుళ్ల దర్శనం కలుగుతుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment