రైతులే సమిధలు
► మార్కెట్‌పై దాడి ఘటనలో పదిమంది జైలుకు
► ఇంత జరిగినా అధికారులు, వ్యాపారుల నిర్లక్ష్యంపై మౌనం !
► రోడ్లపై మిర్చిని దింపిస్తే వ్యాపారుల లైసెన్స్ రద్దని ఇప్పుడు ప్రకటనలు
► ముందే చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని చర్చ
సాక్షి, ఖమ్మం: పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు మార్కెట్‌పై దాడి జరిగిన ఘటనలో సమిధలయ్యారు. గిట్టుబాటు ధర ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడం ..మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్, అధికారులు, వ్యాపారుల ఇష్టారాజ్యాన్ని నియంత్రించకపోవడంతో చివరికి రైతే నష్టపోయాడు. ఖమ్మం మార్కెట్ దాడి ఘటనలో పదిమంది రైతులను ప్రభుత్వం జైలుకు పంపితే ఈ పరిస్థితికి దారితీసిన వ్యాపారులు, అధికారుల నిర్లక్ష్యంపై మౌనంగా ఉండడం పలు విమర్శలకు దారితీసింది.
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా రోడ్లపై మిర్చిని దింపిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని మార్కెట్ కమిటీ ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేదో ముందే చేస్తే రైతు ఆగ్రహం కట్టలు తెంచుకునేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచే మార్కెట్‌కు వేల బస్తాల్లో మిర్చి వస్తోంది. మార్కెట్ లోపల నిండటంతో.. చుట్టుపక్కల రోడ్లపై కూడా మిర్చిని దింపించారు. అయితే ఇవి జెండా పాట అయి.. సరుకు తూకాలు పెట్టి తరలించే వరకు నాలుగైదు, రోజుల సమయం పడుతుంది.
మార్కెట్‌కు సెలవులు ఉంటాయని వ్యాపారులు ప్రచారం చేయడంతో రోడ్లపై తెచ్చిన మిర్చికి ధర తక్కువ పెట్టారనే ఆరోపణలున్నాయి. అయితే ధర తక్కువ ఉందనే ముందుగా గత నెల 28న జరిగిన ఘటనలో మార్కెట్‌యార్డులో కాకుండా బయటనే రైతులు కాంటాలను ధ్వంసం చేశారు. అక్కడినుంచి బయలుదేరి మార్కెట్ కార్యాలయంలోనికి దూసుకొచ్చి దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్లకు నిప్పు పెట్టారు. ధర, సెలవుల విషయంలో కమీషన్ ఏజెంట్లు తప్పుడు ప్రచారం చేశారని కలెక్టర్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం గమనార్హం. అయితే ఈ పరిస్థితికి వచ్చిన కారణాలపై అన్వేషించడం లేదని రైతులతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నిత్యం మార్కెట్‌లో ధర విషయంలో ఆందోళన జరిగినా పరిస్థితి ఎప్పుడో ఒకసారి విషమిస్తుందనే విషయాన్ని పాలకవర్గం, అధికారులు ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ధర ఒక్కసారిగా పడిపోయిందని కలెక్టర్ ఇచ్చిన నివేదికలో కూడా పేర్కొనడం పరోక్షంగా పాలకవర్గం, అధికా రుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్‌లో వ్యాపారులు ధర తగ్గించి అమ్ముతున్నా అధికారులు, పాలకవర్గం ఎందుకు మిన్నకుండా ఉన్నారని, ముందే ఈ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పాలకవర్గం, వ్యాపారుల తీరుపై కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక అందినట్లు సమాచారం. కలెక్టర్ నివేదికను ఆధారం చేసుకుని అసలేం జరిగిందనే దానిపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
చర్యలుంటాయా..?
ఈ సంఘటనలో రైతులను జైలుకు పంపడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే బాధ్యులైన వ్యాపారులు, అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అంతా అయిపోయాక మార్కెట్ పరిసరాల్లోనే రోడ్ల మీద మిర్చిదించితే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని సోమవారం మార్కెట్ కమిటీ నిర్ణయించింది.
ఈ చర్యలు ముందే తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజకీయ పార్టీల నేతల అభిప్రాయం. ధర కోసం రైతులు ఆగ్రహిస్తే జైల్లో పెట్టారని, మరి ఈ పరిస్థితికి కారణం అధికారులు, వ్యాపారులు కాదా..?అని పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.