నిర్మిస్తాం.. అమ్మిపెడతాం
- గ్రీన్‌హౌస్‌ల పంటకు మార్కెటింగ్ కూడా కల్పిస్తామంటున్న కంపెనీలు
- ఉద్యాన అధికారులతో నోయిడా కంపెనీ ప్రతినిధుల చర్చలు
- సాంకేతిక నైపుణ్యం లేని రైతులకు ఇది ప్రయోజనకరమని వెల్లడి
- గ్రీన్‌హౌస్‌కు 9 కంపెనీల టెండర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌హౌస్ సాగుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఆ సాగు విధానంపై ఉద్యాన అధికారులకు, రైతులకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు గ్రీన్‌హౌస్ నిర్మాణం చేపట్టడమే కాకుండా నిర్వహణ బాధ్యతలు చేపట్టి, పంట పండించి, మార్కెట్ లో అమ్మి రైతులకు డబ్బు అందజేస్తామని చెబుతున్నాయి.
ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాయి. తాజాగా నోయిడాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు శనివారం ఉద్యానశాఖ అధికారులను కలిసి ఈ మేరకు విన్నవించారు. రైతులకు సాంకేతిక నైపుణ్యం లేనందున తామే గ్రీన్‌హౌస్ నిర్వహణ బాధ్యత తీసుకొని పంట పండించి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని ముందుకు వచ్చారు.
ఆదాయంలో 20 శాతం ఇస్తే చాలు: గ్రీన్‌హౌస్ నిర్మాణానికి కంపెనీలను టెండర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వాటితో జాబితా త యారుచేస్తుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి అర్హులను గుర్తిస్తుంది. రైతు తన ఇష్టానుసారంగా కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. నిర్ణీత కంపెనీ నెలన్నరలో గ్రీన్‌హౌస్ నిర్మాణాన్ని పూర్తిచేసి పంట పండిస్తారు. దీనివల్ల రైతులకు ఎలాంటి రిస్క్ ఉండదని, వచ్చిన ఆదాయంలో 20 శాతం తమకు ఇస్తే చా లని అంటున్నాయి. ఏడాది పాటు నిర్వహించి చూపిస్తే రైతులు నేర్చుకుంటారని కంపెనీ ప్రతి నిధులు చెబుతున్నారు. నిర్వహణపై ప్రభుత్వం తో సంబంధం లేకుండా రైతులతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు.
30న కంపెనీల తుది జాబితా : గ్రీన్‌హౌస్ కోసం పిలిచిన టెండర్లలో మొత్తం తొమ్మిది కం పెనీలు పాల్గొన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పుణెకు చెందిన పూజా గ్రీన్‌హౌస్ ఇండస్ట్రీస్, ఇండియన్ గ్రీన్‌హౌస్ ప్రైవేటు లిమిటెడ్, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీ స్, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్, జైన్ ఇరి గేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, హైతాసు కా ర్పొరేషన్, బెంగళూరు, తమిళనాడులకు చెందిన అగ్రి ఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్‌లు టెండర్లలో పాల్గొన్నాయి. సాంకేతిక నైపుణ్యం, అనుభవం, నిబంధనల ఆధారంగా వాటిలో కొన్నిం టిని ఖరారు చేసి ఈ నెల 30న తుది జాబితా తయారు చేస్తామని అధికారులు చెబుతున్నారు.