నేడు మూడు ఇసుక రీచ్‌లకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోని 3 ఇసుక రీచ్‌లకు నేడు టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ అమలులోకి వచ్చింది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) ఇసుక రీచ్‌ల వేలం ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తొలుత కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రీచ్‌లను టీఎస్‌ఎండీసీ వేలం వేసింది.
అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మరో మూడు రీచ్‌ల వేలం నిర్వహించాలని మంగళవారం నిర్ణయించింది. నేడు ఈ రీచ్‌లకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ రీచ్‌లలో ఇసుక వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు టీఎస్‌ఎండీసీ ఎండీ లోకేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా వేలం ద్వారా ఇప్పటికే కరీంనగర్‌లో టన్ను ఇసుక రూ. 375, నల్లగొండలో రూ. 400కు అందుబాటులో ఉంచారు.