విద్యార్థులకు టెన్షన్ పట్టుకుంది. పదోతరగతి.. ఇంటర్మీడియెట్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అయినా ఇంత వరకు సెలబస్ పూర్తికాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు వరకు సెలబస్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. జిల్లాలో చాలా చోట్ల 80 శాతం సెలబస్‌యే పూర్తయింది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 31 తేదీలోగా టెన్త్, ఇంటర్ రెండో సంవ త్సరం, వచ్చే నెలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సెలబస్ రివైజ్ చేయాల్సి ఉంది. పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా విద్యాబోధన సాగాల్సి ఉండగా.. నిలువెల్లా నిర్లక్ష్యంతో అధికారులు ఆచరణ సాధ్యంలో విఫలమయ్యారు. పర్యవేక్షణ లోపం.. ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఖాళీలు విద్యార్థులను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి.
- కరీంనగర్
ఎడ్యుకేషన్
ప్రాజెక్టు మార్కులెలా?
పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయులకు సైతం ప్రహసనంగా మారాయి. ప్రధానంగా ప్రాజెక్టు మార్కులు ఎలావేసేదని తలలు పట్టుకుంటున్నారు. కొత్తగా చేపట్టిన విధాన ంతో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు మార్కులు కేటాయించారు. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు ఉపాధ్యాయులే వేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టుల వారీగా ప్రాజెక్టు పని పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాజెక్టు మార్కులు వేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలోని చాలా ఉన్నత పాఠశాలల్లో ప్రాజెక్టులు తయారు చేసేందుకు అనుకూల వాతావరణం లేదు. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టు విషయానికొస్తే ల్యాబ్ తప్పనిసరి. ఈ సౌకర్యం పాత ఉన్నత పాఠశాలల్లో తప్ప మరెక్కడా లేదు. కేవలం 20 శాతం పాఠశాలలకే ల్యాబ్ సౌకర్యం ఉంది. ప్రాజెక్టు ఇచ్చినా, వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి వారూ లేరు.
ఖాళీల కొరత...
జిల్లా విద్యాశాఖను ఖాళీలు వేధిస్తున్నాయి. 57 మండలాలకు గాను 51 మండలాల్లో ఇన్‌చార్జీ ఎంఈవోలు ఉన్నారు. హెచ్‌ఎంలే ఎంఈవోలుగా వ్యవహరించడంతో ఉపాధ్యాయులు ఎవరూ పట్టించుకున్న పాపానా పోలేదనే ఆరోపణలున్నాయి. డెప్యూటీఈవోల పరిస్థితి అంతే. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ డివిజన్‌లలో ఇన్‌చార్జి డెప్యూటీ ఈవోలే ఉన్నారు. ఎంఈవో కార్యాలయాల్లో ఎమ్మార్పీలు లేకపోవడంతో ఆ విధులూ ఉపాధ్యాయులే నిర్వర్తిస్తున్నారు. దీంతో చాలామంది సార్లు పాఠశాలలకు వెళ్లడంలేదు. పదోతరగతి ఫలితాల్లో 2011, 2012లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2013లో ఐదో స్థానం, 2014లో 14వ స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగించింది. ఈ ఏడాది ఉపాధ్యాయుల కొరత, విద్యావాలంటీర్ల నియామక ప్రక్రియ ఆలస్యం.. నామమాత్రంగా ప్రత్యేకాధికారుల తనిఖీ కారణాలు పదోతరగతి ఫలితాలపై పడే అవకాశం లేకపోలేదు.
సబ్జెక్ట్ టీచర్ల కొరత
ప్రభుత్వ హైస్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ విద్యాసంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణలు లేకపోవడం..పరీక్ష పేపర్ల విషయంలో మొన్నటివరకు సందిగ్దత ఉండడం, ఒక్కో సబ్జెక్ట్‌కు ఉపాధ్యాయుడే ఇరవై మార్కులు వేయాల్సి ఉండడం లాంటి విషయాలతో తలనొప్పిగా ఉంటే కొన్ని పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల లేమికారణంగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఉదాహరణకు బెజ్జంకి మండలం బేగంపేట హైస్కూల్‌లో సోషల్ టీచర్ వేరే సబ్జెక్ట్ బోధించడం, చిగురుమామిడి లో పలు పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో ఒక్కొక్కరు రెండు సబ్జెక్ట్‌లు చెప్పడం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కుపైగా పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నట్లు తెలిసింది. అయినా సబ్జెక్టు టీచర్ల కొరత అంతగా లేదని మాట్లాడడం గమనార్హం.
పరీక్షల టెన్షన్
Published Fri, Dec 19 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement
Advertisement