గూడూరులో ఉద్రిక్తత
ఎస్సై వర్సెస్ జెడ్పీటీసీ
ఎండీ.ఖాసింను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆందోళనకు దిగిన టీఆర్‌ఎస్ శ్రేణులు
విడిపించిన ఎమ్మెల్యే.. శాంతించిన కార్యకర్తలు
గూడూరు : జెడ్పీటీసీ సభ్యుడు, ఎస్సై మధ్య వివాదం చోటుచేసుకోగా గూడూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ కేసు విచారణకు వెళ్తున్న ఎస్సై జూపల్లి వెంకటరత్నంను జెడ్పీటీసీ సభ్యుడు ఎండీ.ఖాసిం దర్భాషలాడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎస్సై ఆయన ఇంటికి వెళ్లి నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎస్సైని జెడ్పీటీసీ నెట్టివేశాడు. దీంతో ఎస్సై అతడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెంటనే ఆయన ఉన్నతాధికారులకు వివరించాడు.
టీఆర్‌ఎస్ కార్యకర్తల రాస్తారోకో..
జెడ్పీటీసీ అరెస్ట్ సమాచారం తెలుసుకున్న అతడి స్వగ్రామం మట్టెవాడకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు గూడూరుకు చేరుకుని ప్రధాన బస్‌స్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నర్సంపేట డీఎస్పీ మురళీధర్, గూడూరు, నర్సంపేట సీఐలు సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితులు చేజారకుండా చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు వినకుండా టైర్లు కాలబెట్టారు. జెడ్పీటీసీ సభ్యుడిని విడుదల చేస్తేనే అందోళన విరమిస్తామని బైఠాయించారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు.
ఎమ్మెల్యే రంగప్రవేశం
కాంగ్రెస్‌కు చెందిన జెడ్పీటీసీ ఎండి. ఖాసిం ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. విషయం తెలుసుకున్న మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ గూడూరుకు చేరుకొని సొంత పూచీకత్తుపై జెడ్పీటీసీని వి డుదల చేయించడంతో ఆందోళన సద్దుమణిగింది. కాగా, తప్పు చేస్తే ఎంతటి వారి కైనా శిక్షతప్పదని నర్సంపేట డీఎస్పీ మురళీధర్ అన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ బందాలగడ్డతండాలో ఓ మహిళపై జరిగిన అఘాయిత్యంపై కేసు విచారణకు వెళ్తున్న ఎస్సైని జెడ్పీటీసీ ఫోన్‌లో దుర్భాషలాడినట్లు తెలిపారు. అధికార పార్టీ జెడ్పీటీసీనని, తాను చెప్పినట్లు వినాలనడం తప్పుకా దా అని ప్రశ్నించారు. పైగా ఎస్సైని నెట్టివేయడం పద్ధతి కాదు కదా... విధులకు ఆటంకం కల్గించిన నేరంపైనే సదరు జెడ్పీటీసీని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై వెంకటరత్నం పాల్గొన్నారు.