సరిహద్దులో ఉద్రిక్తత | Tension on the border | Sakshi
Sakshi News home page

సరిహద్దులో ఉద్రిక్తత

Published Wed, Aug 19 2015 4:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

సరిహద్దులో ఉద్రిక్తత - Sakshi

సరిహద్దులో ఉద్రిక్తత

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాకు ఎగువనుంచి వచ్చే నీటిని అడ్డుకునే విధంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో గిరిజాపూర్ వద్ద నిర్మిస్తున్న అక్రమబ్యారేజీని మంగళవారం పరిశీలించేందుకు వెళ్లిన జిల్లా ప్రజాప్రతినిధులకు అడుగడుగునా అడ్డగింతపర్వం ఎదురైంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిని కర్ణాటకలో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేకవాహనాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ శ్రేణులు కర్ణాటకలోని గిరిజాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. కర్ణాటక ప్రాంతానికి వెళ్లే బ్రిడ్జి వద్ద కర్ణాటక పోలీసులు మంత్రి జూపల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. గిరిజాపూర్‌లో నిర్మిస్తున్న బ్యారేజీని పరిశీలించేందుకు వచ్చామని, ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చామని అక్కడి పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో మంత్రి కర్ణాటక పోలీస్ అధికారులతో ఫోన్‌లో చర్చలు జరిపారు.

రాయిచూర్ జిల్లాలోని గిరిజాపూర్, శక్తినగర్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని అనుమతించడం కుదరదని పోలీసులు స్పష్టం చేసి ఇక్కడినుంచి వెళ్లిపోవాలని గట్టిగానే హెచ్చరించారు. అరగంట పాటు తర్జనభర్జనపడిన కర్ణాటక పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించి బ్రిడ్జి మీద నిరీక్షిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని గిరిజాపూర్ బ్యారేజీ నిర్మాణస్థలిని పరిశీలించేందుకు అనుమతించారు.

 రాయిచూర్ ఎంపీ, ఎమ్మెల్యే చర్చలు
 ఈ సమయంలో రాయిచూర్ ఎమ్మెల్యే శివరాాజ్‌పాటిల్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి వద్దకు వచ్చి చర్చలు జరిపారు. బ్యారేజీ నిర్మాణంపై అనేక అపోహలు లేవనెత్తుతున్నారని, వాస్తవంగా ఆ పరిస్థితి లేదని కేవలం రాయిచూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు అవసరమైన నీటిని వినియోగించుకునేందుకు చట్టానికి లోబడే రోడ్డుకం బ్యారేజీని నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. అదే సమయంలో రాయిచూర్ ఎంపీ నాయక్ సైతం అక్కడకు చేరుకుని వారితోచర్చించారు. ఈ సమయంలో పోలీసులు కల్పిస్తున్న ఆటంకాలపై ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి వారికి వివరించి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రాయిచూర్ జిల్లా అధికారులతో అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడి టీఆర్‌ఎస్ నేతలు గిరిజాపూర్‌కు చేరుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. మీడియాను మాత్రం అనుమతించలేదు.

 తప్పని నిరీక్షణ
 గంటపాటు నిరీక్షణ అనంతరం గిరిజాపూర్ బ్యారేజీ నిర్మాణానికి బయలుదేరిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి బ్యారేజీ నిర్మాణం ప్రాంతంలో దాదాపు గంటసేపు గడిపారు. అక్కడ ఎంత నీటినిల్వ సామర్థ్యం ఉన్న బ్యారేజీని పరిశీలిస్తున్నారు.. అనుమతులు ఏమిటన్న అంశంపై అక్కడి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యారేజీ నిర్మాణానికి తమకు కృష్ణ రివర్‌బోర్డు అనుమతి ఉందని అక్కడి అధికారులు చెప్పగా వాటికి సం బంధించిన ఆధారాలు, వివరాలు కావాలని కోరారు.

గిరిజాపూర్ వద్ద నిర్మించే బ్యారేజీ ద్వారా నిల్వ చేసే 0.4 టీఎంసీ నీటిని రాయిచూర్ థర్మల్ పవర్‌స్టేషన్‌లో విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నామని, ఈ విద్యుత్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలోని సగం ప్రాంతానికి పంపిణీ చేస్తున్నామని వివరించారు. అనుమతుల్లేకుండా బ్యారేజీ నిర్మాణం కొనసాగుతోందని, దీనిపై కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. పదేపదే జలదోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక ప్రభుత్వం తీరుపై న్యాయపోరాటం చేస్తామని, దీనిపై పార్లమెంట్‌లో నిలదీస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శివకుమార్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement