కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం పదో తరగతి జీవశాస్త్రం పేపర్ లీక్ అయ్యింది.
అరగంటలోనే ప్రశ్నలు రాసి బయటకు ప్రైవేటు పాఠశాలతో ఇన్విజిలేటర్లు కుమ్మకు?
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం పదో తరగతి జీవశాస్త్రం పేపర్ లీక్ అయ్యింది. ఈ కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే తెల్లకాగితంపై ప్రశ్నలు రాసి బయటకు పంపించారు. ఈ కేంద్రంలోని ఇన్విజిలేటర్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రశ్నలు బయటకు పంపినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఓ పేరున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కేంద్రం వద్ద తచ్చాడుతూ ఇన్విజిలేటర్ల సహాయంతో విద్యార్థులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు చేరవేస్తున్నట్లు మరో పాఠశాల యాజమాన్యం గమనించింది. శుక్రవారం తెల్లకాగితంపై రాసి ప్రశ్నలు బయటకు రాగానే మీడియాకు, అధికారులకు సమాచారం అందించారు. వెంటనే తహశీల్దార్ రజిత, సీఐ తులాశ్రీనివాస్‌రావు, ఎంఈవో నర్సింగం వచ్చి పరిశీలించారు. పేపర్ లీక్‌కు కారణమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.