
తీర్మాన ప్రతిని చూపుతున్న సర్పంచ్ పద్మమ్మ
వనపర్తి: చిన్నపిల్లలు, మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తే.. గ్రామంలో ఉండే అర్హత కోల్పోతారని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామ పంచాయతీలో బుధవారం సర్పంచ్ పద్మమ్మ తీర్మానం చేశారు. ఇటీవల తరుచూ.. మహిళలు, చిన్నపిల్లలపై చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తాడిపర్తిలో మహిళలకు అందించాల్సిన పౌష్టికాహారం, సామర్థ్యం అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామంలోని మహిళలతో పాటు సర్పంచ్ పద్మమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గురించి ప్రస్తావన వచ్చింది. గ్రామస్తులంతా ఒక్కతాటిపై ఉండి మన గ్రామంలో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ఆలోచించారు. వెంటనే ఉపసర్పంచ్ రామకృష్ణ, ఇతర వార్డుల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులను పిలిపించారు. చిన్న పిల్లలు, మహిళలపైగాని అత్యాచారానికి పాల్పడినా.. ప్రయత్నించినా.. అట్టి వారికి గ్రామంలో నివసించే స్థానం ఉండదని తీర్మానం చేశారు. ఈ రోజు నుంచే గ్రామ పంచాయతీ చేసిన ఈ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు, పక్కాగా అమలుచేస్తామని సర్పంచ్ ప్రకటించారు. మహిళలు, పెద్దలు, ఇతర గ్రామస్తులు పంచాయతీ చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. గ్రామంలో ఉన్న ఐక్యతను చూసిన ఆర్డీఎస్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ ప్రతిని«ధి శ్రీవాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఆర్‌ఓ, ఎఎన్‌ఎం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment