హైదరాబాద్: కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల హాల్‌టికెట్లు పొందలేకపోయిన విద్యార్థులకు ఊరట కల్పించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. విద్యార్థులు సకాలంలో పరీక్ష ఫీజులను చెల్లించినప్పటికీ యాజమాన్యాలు చేసిన తప్పు వల్ల విద్యార్థులు నష్టపోకుండా చూసేలా నిర్ణయం తీసుకుంది. అలాంటి విద్యార్థుల దరఖాస్తులు తీసుకొని హాల్‌టికెట్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యార్ తెలిపారు. గతంలోనే ఫీజులు చెల్లించినట్లు ఆధారం చూపించిన వారి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ పొరపాటు లేని విద్యార్థులకు అన్యాయం జరగొద్దని, వారు పరీక్షలు రాసే అవకాశం ఇచ్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు.
పరిస్థితిని బట్టి ఆలస్య రుసుము
ఈ విషయంలో బోర్డును ఆశ్రయించిన యాజమాన్యాల నుంచి విద్యార్థుల పరీక్ష ఫీజులు, ఆలస్య రుసుము, దరఖాస్తులు తీసుకొని హాల్ టికెట్లు ఇవ్వాలని ఆదివారం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒక్కో విద్యార్థికి సంబంధించిన పరీక్ష ఫీజును ఆలస్యంగా చెల్లింపు కారణంగా యాజమాన్యాలకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల చొప్పున ఆలస్య రుసుము విధించింది. ఈ మేరకు బోర్డును ఆశ్రయించిన యాజమాన్యాల నుంచి పరీక్ష ఫీజు, ఆలస్య రుసుముతోపాటు దరఖాస్తులను స్వీకరించి అప్పటికప్పుడే హాల్‌టికెట్లు ఇచ్చేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. గతంలో పరీక్ష రాసి, ఫెయిలైన ప్రైవేటు విద్యార్థుల దరఖాస్తులైతే రూ. 5 వేలు చొప్పున, రెగ్యులర్ విద్యార్థుల దరఖాస్తులైతే రూ. 10 వేల చొప్పున యాజమాన్యాలకు జరిమానా విధించి దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష ఫీజులను యాజమాన్యాలకు విద్యార్థులు సకాలంలోనే చెల్లించినా, ఆ ఫీజులను ఇంటర్‌బోర్డుకు జమ చేయకుండా, ఆన్‌లైన్‌లో ఆ విద్యార్థుల దరఖాస్తులను బోర్డుకు పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యాలపై చర్యలు చేపట్టింది. ఆలస్య రుసుము/జరిమానా చెల్లించి హాల్‌టికెట్లు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. కానీ యాజమాన్యాలకే పరీక్ష ఫీజులను చెల్లించని విద్యార్థుల విషయంలో తామేం చేయలేమని పేర్కొంది.
పరీక్షలకు సర్వం సిద్ధం: నేటి నుంచి నిర్వహించే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యార్ వెల్లడించారు.
విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష హాల్లోకి వెళ్లాలని తెలిపారు. 9 గంటల తరువాత అనుమతించరని పేర్కొన్నారు. వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తంగా 9,73,237 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు, లేదా పోగొట్టుకున్న వారెవరైనా తమ వెబ్‌సైట్ నుంచి (ఠీఠీఠీ.ఛజ్ఛ్ట్ఛ్చీజ్చ్చ.ఛిజజ.జౌఠి.జీ) హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వారి పాత హాల్ టికెట్ నంబరు లేదా పదో తరగతి హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి హాల్ టికెట్ పొందవచ్చని వివరించారు.