అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్ | The arrest of the national team | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్

Published Fri, May 30 2014 4:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

The arrest of the national team

వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ :  వరంగల్, హైదరాబాద్ నగరాల్లో చైన్‌స్నాచింగ్, చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు, సోనీ ఎల్‌సీడీ టీవీ, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ క్రైం డీఎస్పీ రాజమహేంద్రనాయక్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా ఓదెల మండలం రూపునారాయణ గ్రామానికి చెందిన ఐలవోని రామకృష్ణ, విశాఖపట్నంకు చెందిన దండేటి నాగరాజు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్నారు.
 
రామకృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటుపడిన అతడికి తనకు వచ్చే జీతం సరిపోక మోటార్ సైకిల్, సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడటంతో 2012లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అతడు శిక్షా కాలం పూర్తి చేసుకొని తిరిగి వచ్చి ఫుడ్ క్యాటరింగ్‌లో పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవ న్ ప్రాంతానికి మకాం మార్చాడు. ఇదే ఎన్‌టీఆర్ భవన్ ప్రాంతంలో ఒకరి వద్ద రెండో నిందితుడు దండేటి నాగరాజు  కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

తన యజమాని ఇంటి వద్ద కారు పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో అతడు కారును రామకృష్ణ నివాసముంటున్న ఇంటి పరిసరాల్లోని చెట్ల నీడలో పార్కింగ్ చేసుకుని సేద తీరేవాడు. ఈ క్రమంలోనే నాగరాజు, రామకృష్ణ మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలసి జల్సాలు చేయడంతోపాటు చెడు వ్యసనాలకు బానిసలై తమ సంపాదన సరిపోకపోవడంతో జల్సాల కోసం చైన్‌స్నాచింగ్‌లు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేయడమే మార్గంగా ఎంచుకున్నారు. ఇద్దరు కలిసి వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డారు.

హన్మకొండ, సుబేదారి, మట్టెవాడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మూడు చైన్‌స్నాచింగ్‌లు, సుబేదారి ప్రాంతంలో ఒక చోరీ, హైదరాబాద్‌లో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. గురువారం ఉదయం నిందితులు తమ వద్ద ఉన్న దొంగసొత్తును వరంగల్ చౌరస్తాలోని బులియన్ మార్కెట్‌లో అమ్మేందుకు రాగా సమాచారం అందుకున్న డీఎస్పీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ ఆదినారాయణ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము పాల్పడిన నేరాలను ఒప్పుకున్నారు.

నిందితులను అరెస్టు చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన అర్బన్ క్రైం డీఎస్పీ రాజమహేంద్రనాయక్, ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణ, ఎస్సై లక్ష్మీనారాయణ, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, రవి, సల్మాన్‌పాషా, జంపయ్య, హోంగార్డు రవికి అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు చేతుల మీదుగా రివార్డులను అందజేయడం జరుగుతుందని డీఎస్పీ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement