మానుకోటలో పేలిన తూటా
నకిలీ నక్సలైట్ల హల్‌చల్
దాడిని ప్రతిఘటించి, పోలీసులకు పట్టించినగొర్రెల కాపరులు
బెదిరింపు కాల్స్‌తో ఆందోళన చెందుతున్న వ్యాపారులకు ఉపశమనం
చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు
మహబూబాబాద్/మహబూబాబాద్‌టౌన్ : మానుకోట పట్టణంలో గురువారం రాత్రి నకిలీ నక్సలైట్ల తుపాకీ కాల్పులు కలకలం సృష్టించారుు. అమాయకులైన గొర్రెల కాపరులపై తమ ప్రతాపం చూపించబోగా.. చివరికి వారు ప్రతిఘటించడంతో పోలీసులకు చిక్కారు. కాల్పుల ఘటన సమాచారం దావానలంలా పట్టణంలో వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గొర్రెల కాపరుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి, దామర్లగిద్ద మండలం మద్దర్లబీడు గ్రామానికి చెందిన 20 మంది యాదవులు సుమారు 2 వేల గొర్రెలను మేపుతూ గురువారం రాత్రి మానుకోట శివారు నర్సంపేట రోడ్డులోని ఏటిగడ్డతండ శివారు క్రషర్ మిల్లు సమీపానికి చేరుకున్నారు. అక్కడే వంట చేసుకున్నారు. వారున్న సమీప ప్రాంతంలో వారికి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర సామగ్రి కనిపించారుు. కొన్ని గంటల తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గొర్రెల మందకు వచ్చి ఆ జీవాల యజమాని ఎవరు ? ఎక్కడ నుంచి వచ్చారని బెదిరించారు. దీంతో ఆ గొర్రెల కాపరులు వచ్చినవారు దొంగలు అనుకుని ఒకరిపై చేయి జేసుకున్నారు. దీంతో దుండగుల్లో ఒకడు వెనక్కి వెళ్లి మరో నలుగురిని మంద దగ్గరికి తీసుకొచ్చాడు. వారంతా కలిసి ఆ గొర్రెల కాపరులపై దాడికి పాల్పడ్డారు. అకారణంగా చితకబాదడంతో గొర్రెల కాపరులంతా అనవసరంగా కొడుతున్నారంటూ ఎదురు తిరిగి వారిపై చేయిజేసుకున్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఆ ఆరుగురు సభ్యుల్లోని ఇద్దరు తమ వద్ద ఉన్న తపంచాలతో నేలపై కాల్పులు జరపగా ఒక తపంచాకు సంబంధించిన తూటా పేలగా మరో తపంచా తూటా పేలలేదు. అదే సమయంలో ఎస్సై ప్రసాదరావుకు సమాచారమివ్వడంతో ఆయన ట్రాఫిక్ ఎస్సై మధూకర్‌కు చెప్పారు. దీంతో ఆయన ఏఆర్ కానిస్టేబుల్ సంపత్, హోంగార్డు సంపత్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఆరుగురిలో నలుగురు పారిపోగా ఇద్దరిని మాత్రం గొర్రెల కాపరులు పట్టుకోగలిగారు. వారి దగ్గరే రెండు తపంచాలు లభించాయి. అదే సమయంలో సాలార్‌తండా వద్ద నాకాబందీ నిర్వహిస్తున్న సీఐ నందిరామ్‌నాయక్ పారిపోతున్న మరొకరిని పట్టుకున్నారు. అతడి వద్ద తపంచా, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని విచారించగా వారు నకిలీ నక్సలైట్లుగా తేలింది. గతంలో జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించి కనుమరుగైపోరుున సీపీయూఎస్‌ఐ పేరిట వారు కొన్ని నెలలుగా దందాలకు పాల్పడతున్నారని వెల్లడైంది.
సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, మానుకోట డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. గొర్రెల కాపరులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నకిలీ నక్సలైట్ల చర్యలతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా గత కొద్ది రోజులుగా నక్సలైట్ల పేరుతో వస్తున్న బెదిరింపు కాల్స్‌తో భయపడుతున్న వ్యాపారులకు మాత్రం ఉపశమనం లభించినట్లయింది.