కొత్త సంస్థలన్నీ ఈ నియోజకవర్గంలోనే తాజాగా నాలుగు విద్యా సంస్థలు
{పభుత్వానికి ప్రతిపాదనలు ఆరు నెలల్లోపే కార్యకలాపాలు
వరంగల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్‌కు గుర్తింపు పెరుగుతోంది. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ప్రభుత్వం మన జిల్లాకే కేటాయిస్తోంది. ఇలా.. జిల్లాకు మంజూరు చేసిన దాదాపు అన్ని విద్యా సంస్థలూ వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఏర్పాటవుతున్నాయి. నగరానికి సమీపంలో ఉండడంతో పాటు సర్కార్ భూములు కూడా అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం కొత్తగా ప్రకటించే విద్యా సంస్థలు వర్ధన్నపేట పరిధిలోనే నిర్మాణం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల జిల్లాలో మూడు రోజులు పర్యటించిన సందర్భంగా వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దీంట్లో భాగంగా జిల్లాకు వ్యవసాయ కాలేజీ, పత్తి పరిశోధన కేంద్రం, వెటర్నరీ కాలేజీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, గిరిజన యూనివర్సిటీలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటించిన దాదాపు అన్ని విద్యా సంస్థలూ వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే నాలుగు విద్యా సంస్థలు ఈ సెగ్మెంట్‌లోనే ఏర్పాటు చేసేలా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రతిపాదనలు రూపొందించారు. ఆరు నెలల్లోపే కొత్త విద్యా సంస్థలన్నీ కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా మామునూరులోనే వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. మామునూరులో ప్రస్తుతం ఉన్న పశుసంవర్థక పరిశోధన సంస్థ సమీపంలోనే వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెటర్నరీ కాలేజీకి అనుబంధంగా ఇక్కడ గొర్రెలు-మేకలు, గేదెలు, కోళ్ల పరిశోధన సంస్థలు ఏర్పాటు కానున్నాయి.హన్మకొండ మండలం ఆరెపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం(ఆర్‌ఏఆర్‌ఎస్) ఉంది. ఇప్పటికే పలు వ్యవసాయ పరిశోధన సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే వ్యవసాయ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రధాన వ్యవసాయ పంటగా ఉన్న పత్తి పరిశోధన కేంద్రాన్ని ఆర్‌ఏఆర్‌ఎస్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వ్యవసాయ విద్యా, పరిశోధన సంస్థలకు ఆరెపల్లి కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న స్థలానికి అదనంగా 300 ఎకరాల స్థలాన్ని సమీపంలో గుర్తించారు. సిద్ధాపురం, అర్వపల్లి మధ్యలోని ప్రభుత్వ స్థలాలను సైతం వ్యవసాయ పరిశోధనల కోసం కేటాయించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
హన్మకొండ మండలం మడికొండ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు కేంద్రంగా మారుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్‌ని మడికొండ-రాంపూర్ మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. టీఎస్‌ఐఐసీ పరిధిలోని 18 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌పీఎస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భవనాల నిర్మాణం జరిగేలోపే హెచ్‌పీఎస్ ప్రారంభమవుతోంది. కొత్త భవనాలు సిద్ధమయ్యే వరకు హనన్‌పర్తిలోని సంస్కృతి విహార్‌లో హెచ్‌పీఎస్ తరగతులను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, హెచ్‌పీఎస్ బాధ్యులు నిర్ణయించారు.
హైదరాబాద్‌కు అనుబంధంగా పలు జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మడికొండ సమీపంలో ఐటీ రంగం అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటోంది. మడికొండలో నిర్మాణం పూర్తయిన ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. ఇన్ఫోసిస్ సంస్థ జిల్లాలోనే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక శిక్షణ కేంద్రం జిల్లాకు వస్తే మడికొండలోనే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరికొన్ని కొత్త విద్యా సంస్థలు నెలకొల్పేందుకు మామునూరులో అనువైన స్థలాలు ఉన్నాయి. మామునూరులోని పశుసంవర్థక పరిశోధన సంస్థల సమీపంలో ప్రస్తుతం 390 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. దీంతో మరిన్ని విద్యా సంస్థలు ఇక్కడే నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సైనిక్ స్కూల్ సైతం మామునూరు పోలీసు క్యాంపు సమీపంలోనే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎంతో తృప్తి కలిగిస్తోంది
గొప్ప చరిత్ర, ఉద్యమ నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లాకు గతంలో తగిన గుర్తింపు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి మారింది. విద్యతోనే అభివృద్ధికి అడుగులు పడతాయి. వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త విద్యా సంస్థలన్నీ వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఏర్పాటు కానుండడం చెప్పలేనంత సంతోషంగా ఉంది.
- అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే
వర్ధన్నపేట.. అభివృద్ధి బాట
Published Thu, Jan 14 2016 1:37 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM
Advertisement
Advertisement