ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం
కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి..
పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి
ఖమ్మం అర్బన్: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 50 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించి ఖమ్మం ఖిల్లాపై పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నగరంలోని 15, 17, 31 డివిజన్ల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ పనిచేసినా దృఢ సంకల్పంతో ముందుకు సాగేవారన్నారు.
ఆయన బతికున్నంతకాలం పది మందికి మేలు చేశాడని, కృషి పట్టుదల ఉంటే ఎలాంటి వారినైనా విజయం వరిస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. నగరంలోని 17వ డివిజన్‌లో వడ్డెబోయిన శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులతోపాటు సుమారు 70 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి పొంగులేటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోఆర్డినేటర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిర ంజన్‌రెడ్డి, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు తోట రామారావు, ప్రధాన కార్యదర్శి మలీదు జగన్, తుమ్మా అప్పిరెడ్డి, మందడపు రామకృష్ణారెడ్డి, ఇస్లావత్ రాంబాబు, లక్ష్మణ్ పాల్గొన్నారు.