Khammam Corporation Election
-
'రాములోరి సాక్షిగా వాళ్లను తిరిగి రానివ్వం'
సాక్షి, ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా పార్టీ ఫిరాయించిన నేతలను తిరిగి పార్టీలోకి రానివ్వమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతో గెలిచిన వారు పార్టీని వదిలిపెట్టడం బాధాకరమని, వారిని తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గుర్తు మీద గెలిచి ఫిరాయించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ.. 'మన బూత్‌లో గెలవడం మన గౌరవాన్ని పెంచుకోవడం' అన్న నినాదంతో పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్లు తెలంగాణలో కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నా, ఢిల్లీలో స్నేహం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్‌పై విచారణకు ఆదేశిస్తామని, అవినీతి నేతలను శిక్షిస్తామని ఠాగూర్ హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులను టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేవరకు కాంగ్రెస్ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో భావప్రకటనా స్వేచ్ఛ కరువైందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కార్పొరేషన్‌ను గెలిపించుకుని కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. (చదవండి: ఖమ్మం సమావేశానికి కాంగ్రెస్ అతిరథ, మహారధులు) -
వరంగల్, ఖమ్మం ప్రచారానికి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం ఖమ్మంలో ప్రచారం చేస్తారు. ఉదయం 9 గంటలకు పాండురంగాపురం వద్ద రోడ్డు షో మొదలు పెట్టి రాత్రి 9 గంటల దాకా ప్రచారంలో పాల్గొంటారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రెండు నగరాల్లో సమస్యలు, వాటి పరిష్కారానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఇవ్వాల్సిన హామీలపై మంత్రి ఆ రెండు జిల్లాల మంత్రులు, నాయకులతో చర్చించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రతిపక్షాలపై పూర్తిస్థాయిలో పైచేయి సాధిం చే వ్యూహంలో భాగంగా ఈ ఎన్నికలను పార్టీ సవాల్‌గా తీసుకుంది. -
ఖమ్మం ఎన్నికల్లో ఓటుకు రశీదు
♦ ఈవీఎంలకు ప్రింటర్ల అనుసంధానం ♦ ప్రయోగాత్మకంగా 35 పోలింగ్ కేంద్రాల్లో అమలు ♦ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ♦ అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను వినియోగించనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 35 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంతో ఓటరు తాను ఎవరికి ఓటు వేశారో తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)గా పిలిచే ఈ విధానంలో ఈవీఎంలకు అమర్చిన ప్రింటర్ల ద్వారా ఓటరు అక్కడికక్కడే తమ ఓటు రశీదును తీసుకోవచ్చు. ఈవీఎంలతోపాటే ఈ ప్రింటర్ ఉంటుంది కనుక ఓటు వేసిన వెంటనే ఓటరు ప్రింటర్ నుంచి రశీదు తీసుకోవచ్చు. ఈ రశీదులో ఓటరు సీరియల్ నంబర్‌తోపాటు తాను ఎవరికి ఓటు వేశారో ఆ అభ్యర్థి పేరు, గుర్తు ఉంటాయి. అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఓటరు అక్కడికక్కడే పరిశీలించుకొని.. రశీదును పక్కన ఉండే డ్రాప్ బాక్స్‌లో పడేసి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి వేసినట్లుగా రశీదులో వస్తే.. అక్కడికక్కడే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఓటరు తన ఫిర్యాదు నిజమని రాతపూర్వకంగా వాంగ్మూలం ఇస్తే.. అక్కడికక్కడే ఆ అధికారి మరోసారి ‘టెస్ట్ ఓటు’ వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అక్కడ అందుబాటులో ఉన్న పోలింగ్ ఏజెంట్లు లేదా అభ్యర్థుల సమక్షంలో ఈ టెస్ట్ ఓటు వేయాలి. అప్పుడు కూడా రశీదు తప్పుగా వస్తే ఓటింగ్ ప్రక్రియను నిలిపేస్తారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటారు. ఓటరు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే.. ఓటింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఓటరు నుంచి రాతపూర్వక వాంగ్మూలం కూడా తీసుకుంటారు. ఈ టెస్ట్ ఓటు వివరాలను ప్రత్యేక ఫామ్‌లో పొందుపరుస్తారు. పోలింగ్ సందర్భంగా నమోదైన టెస్ట్ ఓట్లన్నింటినీ.. కౌంటింగ్ సందర్భంగా పక్కనబెట్టి మిగతా ఓట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. -
అదిరించి.. బెదిరించి..
♦ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి.. ♦ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికార పక్షం ఖమ్మం: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ఉత్కంఠ నడుమ కొనసాగింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు రెబల్స్ బెడద ఎక్కువగా ఉండటంతో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు నానాయాతన పడాల్సి వచ్చింది. అయినా పలువురు ససేమిరా అనడంతో అదిరించి.. బెదిరించి.. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ, స్క్రూట్నీ తర్వాత 576 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. వీటిలో టీఆర్ఎస్ నుంచి అధికంగా 139 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం బీ-ఫాం అందజేసే ముందు తిరుగుబాటు అభ్యర్థులతో ఆ పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపారు. పలువురు దీనికి అంగీకరించలేదు. నామినేషన్ల ఉపసంహరణ సమయమైన మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూసిన నాయకులు.. రెబల్ అభ్యర్థుల కోసం వెతకడం ప్రారంభించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్‌తోపాటు టీఆర్ఎస్ జిల్లా నేతలు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని.. గడువు ముగిసినా పలువురు అభ్యర్థుల నుంచి బలవంతంగా సంతకాలు చేయించుకుని.. రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్లు ఉపసంహరింపజేసినట్లు సమాచారం. 49వ డివిజన్లో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి సతీశ్ గడువు ముగిసినప్పటికీ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. సతీశ్ 3 గంటల తర్వాత కార్యాలయం వద్దకు వచ్చి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో లోపల ఉన్న కార్యకర్త సైదారావుకు తన నామినేషన్ పత్రాలను ఇచ్చాడు. అప్పటికే సమయం అయిపోయినప్పటికీ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ఉపసంహరించారని పలువురు ఆరోపించారు. కాంగ్రెస్ ఆందోళన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా మారారని ఆరోపిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సమయం ముగిసిన తర్వాత నామినేషన్లు ఉపసంహరించడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే అధికార పార్టీ అధికార, ధనబలాన్ని వినియోగించుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి స్పందిస్తూ రిటర్నింగ్ అధికారుల పరిధిలోనే ఈ వ్యవహారం జరిగిందని, నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించామని చెప్పారు. జరిగిన సంఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలపడంతో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్య తీసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత నామినేషన్లు స్వీకరించడంపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు. సంతకం సక్రమంగానే ఉంది 49వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సతీశ్ నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు వచ్చిన దరఖాస్తులో సంతకం సక్రమంగానే ఉంది. 2.59 గంటలకు ఉపసంహరణ పత్రాన్ని మాకు అందజేశారు. ఫొటో లేనందున మనిషిని గుర్తు పట్టలేదు. - శ్రీనివాసరావు, రిటర్నింగ్ అధికారి -
ఖమ్మంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం
కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి ఖమ్మం అర్బన్: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 50 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించి ఖమ్మం ఖిల్లాపై పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నగరంలోని 15, 17, 31 డివిజన్ల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ పనిచేసినా దృఢ సంకల్పంతో ముందుకు సాగేవారన్నారు. ఆయన బతికున్నంతకాలం పది మందికి మేలు చేశాడని, కృషి పట్టుదల ఉంటే ఎలాంటి వారినైనా విజయం వరిస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. నగరంలోని 17వ డివిజన్లో వడ్డెబోయిన శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులతోపాటు సుమారు 70 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి పొంగులేటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోఆర్డినేటర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిర ంజన్‌రెడ్డి, పార్టీ కార్యాలయ ఇన్చార్జి వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు తోట రామారావు, ప్రధాన కార్యదర్శి మలీదు జగన్, తుమ్మా అప్పిరెడ్డి, మందడపు రామకృష్ణారెడ్డి, ఇస్లావత్ రాంబాబు, లక్ష్మణ్ పాల్గొన్నారు.