అదిరించి.. బెదిరించి..
♦ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి..
♦ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికార పక్షం
ఖమ్మం: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ఉత్కంఠ నడుమ కొనసాగింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు రెబల్స్ బెడద ఎక్కువగా ఉండటంతో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు నానాయాతన పడాల్సి వచ్చింది. అయినా పలువురు ససేమిరా అనడంతో అదిరించి.. బెదిరించి.. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ, స్క్రూట్నీ తర్వాత 576 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. వీటిలో టీఆర్‌ఎస్ నుంచి అధికంగా 139 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
శుక్రవారం బీ-ఫాం అందజేసే ముందు తిరుగుబాటు అభ్యర్థులతో ఆ పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపారు. పలువురు దీనికి అంగీకరించలేదు. నామినేషన్ల ఉపసంహరణ సమయమైన మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూసిన నాయకులు.. రెబల్ అభ్యర్థుల కోసం వెతకడం ప్రారంభించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్‌తోపాటు టీఆర్‌ఎస్ జిల్లా నేతలు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని.. గడువు ముగిసినా పలువురు అభ్యర్థుల నుంచి బలవంతంగా సంతకాలు చేయించుకుని.. రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్లు ఉపసంహరింపజేసినట్లు సమాచారం. 49వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థి సతీశ్ గడువు ముగిసినప్పటికీ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. సతీశ్ 3 గంటల తర్వాత కార్యాలయం వద్దకు వచ్చి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో లోపల ఉన్న కార్యకర్త సైదారావుకు తన నామినేషన్ పత్రాలను ఇచ్చాడు. అప్పటికే సమయం అయిపోయినప్పటికీ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ఉపసంహరించారని పలువురు ఆరోపించారు.
కాంగ్రెస్ ఆందోళన
కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా మారారని ఆరోపిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సమయం ముగిసిన తర్వాత నామినేషన్లు ఉపసంహరించడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే అధికార పార్టీ అధికార, ధనబలాన్ని వినియోగించుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి స్పందిస్తూ రిటర్నింగ్ అధికారుల పరిధిలోనే ఈ వ్యవహారం జరిగిందని, నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించామని చెప్పారు. జరిగిన సంఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలపడంతో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్య తీసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత నామినేషన్లు స్వీకరించడంపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు.
సంతకం సక్రమంగానే ఉంది
49వ డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సతీశ్ నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు వచ్చిన దరఖాస్తులో సంతకం సక్రమంగానే ఉంది. 2.59 గంటలకు ఉపసంహరణ పత్రాన్ని మాకు అందజేశారు. ఫొటో లేనందున మనిషిని గుర్తు పట్టలేదు.
- శ్రీనివాసరావు, రిటర్నింగ్ అధికారి