సాక్షి, ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా పార్టీ ఫిరాయించిన నేతలను తిరిగి పార్టీలోకి రానివ్వమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతో గెలిచిన వారు పార్టీని వదిలిపెట్టడం బాధాకరమని, వారిని తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గుర్తు మీద గెలిచి ఫిరాయించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఆదివారం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ.. 'మన బూత్లో గెలవడం మన గౌరవాన్ని పెంచుకోవడం' అన్న నినాదంతో పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు తెలంగాణలో కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నా, ఢిల్లీలో స్నేహం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్‌పై విచారణకు ఆదేశిస్తామని, అవినీతి నేతలను శిక్షిస్తామని ఠాగూర్ హెచ్చరించారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులను టీఆర్‌ఎస్ మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేవరకు కాంగ్రెస్ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో భావప్రకటనా స్వేచ్ఛ కరువైందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కార్పొరేషన్‌ను గెలిపించుకుని కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.
(చదవండి: ఖమ్మం సమావేశానికి కాంగ్రెస్ అతిరథ, మహారధులు)
Comments
Please login to add a commentAdd a comment