- వరప్రదాయినిగా మారనున్న ‘పాలమూరు ఎత్తిపోతల’
- ఐదు ఎత్తిపోతల స్టేజీలను మూడింటికి కుదింపు
- ప్రాజెక్టు పూర్తయితే 7లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం
- ప్రస్తుత ప్రాజెక్టులతో 9.72లక్షల ఎకరాలకు సాగునీరు
గద్వాల: పాలమూరు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం జూరాల రిజర్వాయర్ నుంచి ఐదు దశల్లో ఎత్తిపోతల ద్వారా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. దీని ఆధారంగా గత ప్రభుత్వం సర్వేకు అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గత రెండు నెలల క్రితం ప్రాథమిక సర్వేచేయడానికి జూరాల అధికారులను ఆదేశించింది. జూరాల ఇంజనీరింగ్ అధికారులు ప్రాథమిక సర్వేను ఇవ్వడంతో సమగ్ర సర్వేకు గతనెలలో ప్రభుత్వం రూ.5.71 కోట్ల అంచనా వ్యయంతో అనుమతించింది. ఈ మేరకు సర్వే సంస్థ ప్రాథమిక నమూనాను సిద్ధంచేసి అధికారులకు అందజేసింది.
ఈ ప్రకారం గతంలో ఉన్న ఐదు ఎత్తిపోతల స్టేజీలను కుదించి కేవలం మూడుచోట్ల మాత్రమే ఎత్తిపోతల ద్వారా మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా నమూనా రూపొందిం చారు. జూరాల రిజర్వాయర్ నుంచి మొదటి లిఫ్టు ద్వారా కోయిల్‌సాగర్ వరకు, రెండోలిఫ్టు కోయిల్‌సాగర్ నుంచి రంగారెడ్డి జిల్లా గండ్వీడ్ రిజర్వాయర్ వరకు పంపింగ్ చేస్తారు. మూడోలిఫ్టు గండ్వీడ్ రిజర్వాయర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ వరకు పంపింగ్ చేస్తారు. కొత్త డిజైన్ ద్వారా ప్రభుత్వానికి అంచనా వ్యయం తగ్గడంతో పాటు త్వరగా పనులు పూర్తయి విద్యుత్ వ్యయం కూడా తగ్గుతుంది.
పాడిపంటలకు నెలవుగా
అడ్డంకులు తొలగి పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే జిల్లా పరిస్థితి మారిపోనుంది. జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడంతో ఎటుచూసినా పచ్చని పొలాల కళకళలాడనుంది. ఇప్పటికే సాగునీరందిస్తున్న ఆర్డీఎస్ ద్వారా 85వేల ఎకరాలు, జూరాల ప్రాజెక్టు ద్వారా 1.07లక్షల ఎకరాల ఆయకట్టుతో గద్వాల, అలంపూర్, మక్తల్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని మండలాల్లో పచ్చని పైర్లు కనిపిస్తున్నాయి.
సాగునీరందేది ఇలా...
జలయజ్ఞం ద్వారా నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో రెండులక్షల ఎకరాలు, భీమా ప్రాజెక్టు పరిధిలో మరో రెండులక్షల ఎకరాలు, కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో 3.30లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పరిధిలో సుమారు 50వేల ఎకరాలు.. ఇలా మొత్తం 16.72 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మరో రెండు నుంచి మూడేళ్లలో కొత్త, పాత ప్రాజెక్టులతో జిల్లాలో 80శాతం సాగుభూములు మాగాణి భూములుగా మారే అవకాశం ఉంది. సాగునీటి వనరులు పెరగడంతో ఇప్పటికే పాడిపరిశ్రమలో ముందున్న పాలమూరు జిల్లా మరింత అభివృద్ధి పథంలో నడిచే అవకాశం కలుగుతుంది. ఈ భారీప్రాజెక్టుపై జిల్లారైతాంగం కోటిఆశలతో ఉంది.
కొత్త డిజైన్‌తో పాలమూరు ఎత్తిపోతల పథకం
సర్వే సంస్థ తయారు చేసిన కొత్త నమూనాతో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, వనపర్తి, షాదనగర్, జడ్చర్ల నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించేవిధంగా రూపొందించారు. మనజిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు, నల్గొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుండడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి కృష్ణానది జలాలను తాగునీటి అవసరాల కోసం అందించాలన్న అంశాన్ని కూడా చేర్చారు. ఈ విధంగా సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను పాలమూరు ఎత్తిపోతల పథకం తీర్చనుంది.
కరువు నేల.. కళకళ!
Published Sun, Sep 21 2014 2:43 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM
Advertisement