‘డెయిరీ’... ఆదుకునే వారేరీ | The dairy industry in crisis | Sakshi
Sakshi News home page

‘డెయిరీ’... ఆదుకునే వారేరీ

Published Thu, Apr 17 2014 2:56 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

The dairy industry in crisis

 గజ్వేల్, న్యూస్‌లైన్: వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా చెప్పుకునే ‘డెయిరీ’ సంక్షోభంలో చిక్కుకుంది. పాలు దిగుబడి భారీగా పెరిగినా, కొనేవారు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.  రైతుకు వెన్నదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ ఏపీ డెయిరీ.. టార్గెట్ దాటిపోయిందనే సాకుతో పాలను కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. ఇదే  అదునుగా ప్రైవేట్ సంస్థలు పాలధరను భారీగా తగ్గించమేకాకుండా కొనుగోళ్లను సైతం తగ్గించుకున్నాయి.

మరోవైపు నాబార్డు అధ్వర్యంలో డెయిరీ పథకాలకు ప్రతిఏటా ఇచ్చే సబ్సిడీకి సర్కార్ మంగళం పాడింది. పశువులకు బీమా సైతం దక్కని పరిస్థితు నెలకొన్నాయి.  దీంతో ఉత్పత్తి వ్యయానికి..అందుతున్న రొక్కానికి వ్యత్యాసం భారీగా ఉండడంతో చాలా మంది డెయిరీలను మూసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2012 అక్టోబర్ 29న తూప్రాన్‌లో ‘ఇందిరమ్మ బాట’లో భాగంగా తూప్రాన్‌లో పర్యటించిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాడిరైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ కూడా నీటి మూటగానే మిగిలిపోవడంతో పాడిపరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోయింది.

 మెదక్ జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమ రెండో అతిపెద్ద పరిశ్రమగా ఆవిర్భవించింది. జిల్లావ్యాప్తంగా లక్ష మందికిపైగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు పశుసంవర్దక శాఖ గుర్తించింది. మూడేళ్ల కిందట జిల్లావ్యాప్తంగా రోజుకు 50 వేల లీటర్ల పాల సేకరణ గగనం కాగా, ఏడాది క్రితం అది ఒక్కసారిగా రెండు లక్షలకుపైగా పెరిగింది. ఈ లెక్కన నిత్యం రూ.4 నుంచి రూ.5 కోట్లకు పైగా పాల వ్యాపారం సాగింది.

 ఇంతటి ప్రాధాన్యత కలిగిన పరిశ్రమ నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. పాల ఉత్పత్తులు పెంచడంతోపాటు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి గిట్టుబాటు ధర అందిస్తామంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం, చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాది కిందట రైతులు ఉత్పత్తి చేసిన 2 లక్షల లీటర్లలో కేవలం 70వేల లీటర్లే కొనుగోలు చేసిన ఏపీ డెయిరీ టార్గెట్ దాటిపోయిందనే కారణంతో కొనుగోళ్లను నిలిపివేసింది. మరోవైపు హెరిటేజ్, తిరుమల, జెర్సీ, ప్రియ తదితర కంపెనీలు రైతుల ద్వారా 1.3 లక్షల లీటర్లు కొనుగోలు చేశాయి. ఈ సంస్థలు కూడా ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయనే కారణంతో కొనుగోళ్లను తగ్గించుకున్నాయి.

అంతేకాకుండా ఆవుపాల ధరను(4 శాతం ఫ్యాట్) 2012లో రూ. 20 నుంచి 22వరకు ఉండగా, 2013లో రూ.14 నుంచి 15కు తగ్గించాయి. ఈ పరిణామంతో తీవ్ర నష్టాల్లో చిక్కుకున్న రైతులు జిల్లాలోని డెయిరీ ఫారాలన్నింటినీ ఎత్తేశారు. ఒక్కసారిగా పాల ఉత్పత్తి తగ్గడంతో స్పందించిన అధికారులు ప్రస్తుతం ఆవు పాల ధర రూ.22 పెంచారు. కానీ డెయిరీ ఫారమ్‌లో నిర్వహణలో దాణా, మందులు ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల లీటర ధర రూ.30 ఇస్తేగానీ రైతులకు గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో పాలధర పెరిగినా రైతులకు నష్టాలే మిగిలాయి.

 నాబార్డు సబ్సిడీకి మంగళం....
 డెయిరీ పథకాలకు నాబార్డు ద్వారా భారీగా సబ్సిడీని అందించేవారు. రూ.5 లక్షల యూనిట్‌కు గతంలో 1.25 లక్షల వరకు సబ్సిడీ వర్తించేది. గత రెండేళ్లుగా జిల్లాలో ఈ సబ్సిడీ రైతులకు వర్తించడం లేదు. మరోపక్క డెయిరీ పథకాలకు రుణాలివ్వడానికి బ్యాంకర్లు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.  ఇక బీమా కూడా అందకపోవడం పాడిరైతులకు గుదిబండగా మారింది. బ్యాంకు లింకేజీ ద్వారా పశువులను కొనుగోలు చేసే రైతులకు ఒక్కో దానికి గరిష్టంగా రూ.35 వేల బీమాను అందజేస్తున్నారు. పశువుల ధర రూ.70 వేలు అంతకుపైగా పలికినా పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం రూ. 35వేలకే బీమాను పరిమితం చేస్తున్నారు. ఇక రైతులు సొంతంగా కొనుగోలు చేసుకునే పశువులకు బీమా పథకం వర్తించడం లేదు.
 
 ఇదీ ఉదాహరణ...
 గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన పాలేటి నర్సింహారావు 2012 ఏప్రిల్‌లో రూ.6 లక్షలకుపైగా వ్యయం చేసి తన పొలంలో షెడ్‌ను నిర్మించుకున్నాడు. అంతేకాకుండా మరో రూ.7 లక్షలకుపైగా వ్యయంతో బెంగుళూరు నుంచి పది సంకరజాతి ఆవులను తెచ్చుకున్నాడు. వీటి కోసం రుణం అందించాలని రెండేళ్లుగా గజ్వేల్‌లోని ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా బ్యాంకర్లు స్పందించలేదు.
 చివరకు సొంత డబ్బుతోనే షెడ్ నిర్మాణం, ఆవుల కొనుగోళ్లు చేపట్టాడు.

 తనకు సాయంగా బీహార్‌కు చెందిన ఇద్దరిని నియమించుకుని ఐదు నెలలపాటు డెయిరీని నిర్వహించాడు. 2102 ఆగస్టు నుంచి సంక్షోభం ఏర్పడిన కారణంగా పాల ధర విపరీతంగా తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, చాలా సందర్భాల్లో పాలు కొనే నాథుడే కరువవడంతో ఆదాయం మాటేమోగానీ నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి.

 దీంతో పది పశువులను రూ.3 లక్షల నష్టానికి అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం షెడ్ అతని పొలంలో వృథాగా మిగిలిపోయింది.

 నెరవేరని ‘ఇందిరమ్మ బాట’ హామీలు....
 2012 అక్టోబర్‌లో 29 నుంచి జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ బాటలో డెయిరీ రైతులు తమ ఇబ్బందులను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సబ్సిడీలు, బీమా వర్తింపుపై విజ్ఞప్తి చేశారు. దీనిపై కిరణ్‌కుమార్‌రెడ్డి సభాముఖంగా హామీ ఇచ్చారు. కానీ హామీలు నెరవేరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement