దళిత మహిళలకు భూ పంపిణీ
ఆనందంలో లబ్ధిదారులు
సాక్షి, సంగారెడ్డి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి హరీష్‌రావు శుక్రవారం దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి విడతలో ఎంపికైన 45 మంది లబ్ధిదారులకు 135 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కూలినాలి చేసుకునే తమకు ప్రభుత్వం మూడెకరాలు అందజేసి మా కుటుంబాలను రైతు కుటుంబాలుగా మార్చిందని ఆనందంగా తెలిపారు.
ఇదిలా ఉంటే భూ పంపిణీ పథకం కింద ఎంపికైన జిల్లాకు చెందిన ఆరుగురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. దళితులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.