
జిల్లాకు అరుదైన గౌరవం
కరీంనగర్ సిటీ : జిల్లాకు మరో ఉన్నత పదవి లభించింది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా బుధవారం ఎన్నికయ్యారు. ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, రెండు కీలకమంత్రి పదవులతో జిల్లాకు సముచిత స్థానం ఉండగా తాజాగా శాసనమండలి చైర్మన్‌లాంటి అత్యున్నత పదవి తొలిసారిగా జిల్లాకు దక్కింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన స్వామిగౌడ్ టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. అప్పుడే కేసీఆర్ ఆయనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఉద్యోగ విరమణ అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనను కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీకి నిలిపారు. 2013 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన 2019 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇన్నాళ్లూ ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా ఉన్న చక్రపాణి ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్‌గా కొనసాగనున్నారు. తెలంగాణకు ప్రత్యేక మండలి ఏర్పాటు కాగా చైర్మన్ ఎన్నికను బుధవారం నిర్వహించారు.
ఉద్యోగవర్గాలనుంచి ఎమ్మెల్సీగా గెలిచిన స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించగా... సామాజిక సమీకరణాల దృష్ట్యా పదవి దక్కలేదు. దీంతో మండలి చైర్మన్‌లాంటి ఉన్నత పదవిని స్వామిగౌడ్‌కు కట్టబెట్టేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంతో పూర్తి పట్టు సాధించారు. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఎన్నికల్లో స్వామిగౌడ్ మండలి చైర్మన్‌గా విజయం సాధించారు.
భానుప్రసాద్ ఓటు స్వామిగౌడ్‌కే
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న టి.భానుప్రసాద్‌రావు శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్‌కు ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన భానుప్రసాద్‌రావు, కొద్ది రోజుల క్రితం గులాబీ గూటికి చేరారు. అయినప్పటికీ సాంకేతికంగా ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. మండలి చైర్మన్ ఎన్నికలను కాంగ్రెస్, టీడీపీలు బహిష్కరించగా, భానుప్రసాద్‌రావు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలైన మొత్తం 21 ఓట్లు స్వామిగౌడ్‌కు పడడంతో, భానుప్రసాద్ కూడా స్వామిగౌడ్‌కు వేసినట్లు తేలిపోయింది.