వీడని నీడలు
సాంబశివరావుపై వేటు
జిల్లా వైద్యాధికారి సస్పెన్షన్
రాష్ట్రస్థాయిలో అక్రమాలే కారణం
వరంగల్ : అక్రమాల ఆరోపణలపై జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పి.సాంబశివరావుపై వేటు పడింది. సర్వీసు నుంచి సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కొత్తగా 108 వైద్య సేవల వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయిం చింది. సాంబశివరావు అప్పట్లో ప్రజారోగ్య శాఖ డెరైక్టర్‌గా ఉన్నారు. 108 వైద్య సేవల వాహనాల కొనుగోలు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ప్రాథమిక విచారణ తర్వాత సాంబశివరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలంలోనే ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి పోస్టుకు చేరిన సాంబశివరావు అంతే వేగంగా కిందికి వచ్చారు. ఇప్పడు సర్వీసు నుంచి సస్పెండ్ అయ్యారు.
పోస్టు కోసం పోటీ
2011 డిసెంబరులో సాంబశివరావు జిల్లా వైద్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2014 జూలై వరకు ఈ పోస్టులో పని చేశారు. 2014 జూన్ 2న రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా వైద్య శాఖ బాధ్యతలను చేపట్టడంతో సాంబశివరావు వేగంగా పదోన్నతులు పొందారు. శాఖ పరమైన అక్రమాలపై అప్పటికే పలు ఆరోపణలు ఉన్నా ఆయనకు జూలై 1న ప్రాంతీయ డెరైక్టరు పోస్టు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా జూలై 31న వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర డెరైక్టరుగా పోస్టింగ్ పొందారు. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ విషయంలోనే ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వైద్య శాఖ మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్య బర్తరఫ్‌కు కారణమైన ఆరోపణల విషయంలో సాంబశివరావును ప్రభుత్వం ఆ పోస్టు నుంచి తప్పించింది. జనవరిలో సాంబశివరావు ఆఖరు వారంలో మళ్లీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర స్థాయిలో ఆరోపణలు ఆయనను వెంటాడుతూనే వచ్చాయి. రాష్ట్ర డెరైక్టరుగా సాంబశివరావు తీసుకున్న నిర్ణయాలపై విచారణలు జరుగుతున్నాయి. 108 సేవల వాహనాల కొనుగోలు అంశంలో ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. సాంబశివరావు సస్పెన్సన్ నేపథ్యంలో ఆయన పోస్టు పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా శిక్షణ ప్రాజెక్టు అధికారి(పీవోడీటీ) శ్రీరాం, జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి సాంబశివరావు పేర్లు ఈ పోస్టుకు వినిపిస్తున్నాయి.