- నేటినుంచి మూతపడనున్న హెచ్‌ఎన్ కేంద్రాలు
- ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం అమలులోకి వచ్చినందునే
- మిగిలిన నిధులు స్త్రీనిధి ఖాతాలకు మళ్లింపు
- నిరాశ పడుతున్న పలువురు మహిళలు
నాగిరెడ్డిపేట : గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారా న్ని అందించేందకు ఇందిరాక్రాంతిపథం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య-పోషణ కేంద్రాలు (హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్స్) గురువారం నుంచి మూతపడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడికేంద్రాలలో ‘ఆరోగ్యలక్ష్మి’ పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో హెచ్‌ఏఎన్ సెంటర్లను మూసేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈమేరకు ప్రభుత్వం ఈనెల ఏడున ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు.
2010లో ప్రారంభం
గత ప్రభుత్వం 2010లో ఆరోగ్య, పోషణకేంద్రాలను ఏర్పాటు చేసింది. నాగిరెడ్డిపేట మండలంలో 5, ఎల్లారెడ్డి మండలంలో 5, లింగంపేట మండలంలో 5, గాంధారి మండలంలో 5, తాడ్వాయిలో 7, దోమకొండలో 4, మాచారెడ్డిలో 9, డిచ్‌పల్లిలో 5, ధర్పల్లిలో 13, సిరికొండలో 14గ్రామాల్లో హెచ్‌ఎన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలకు వచ్చే పెద్దవారి నుంచి రోజూ ఐదు రూపాయలు తీసుకొని వారికి ఒక్కపూట భోజనం, పాలు, గుడ్డుతోపాటు ఉడికించిన చిరుధాన్యాలు,పల్లీపట్టి ఇచ్చేవారు. చిన్నారులకు మూడు రూపాయలు తీసుకొని భోజనం, పాలు, గుడ్డు పెట్టేవారు. నిధుల కొరతతోపాటు, గ్రామాలలో అమలవుతున్న ఆరోగ్యలక్ష్మి పథకం కారణంగా కొంతకాలంగా లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి చొప్పున వసూలు చేసి వారికి ఉడికించిన శనగలు, మొలకెత్తిన విత్తనాలను అందజేస్తున్నారు. దీంతో పాటు ఈ కేంద్రాలను ఎస్‌సీ, ఎస్‌టీలకు మాత్రమే పరిమితం చేశారు.
ఒక్కొ కేంద్రానికి రూ.3.80 లక్షలు
గ్రామాలలో ఏర్పాటు చేసిన ఒక్కో పౌష్టికాహార కేంద్రానికి రూ.3.80 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. అందులో నుంచి రూ.50 వేలు వెచ్చించి కేంద్రాల నిర్వ హణకు అవసరమైన వంట సామాగ్రిని కొనుగోలు చేశారు. మిగిలిన రూ.3.30 లక్షలను గ్రామసంఘంలోని సభ్యులకు రుణాలుగా ఇవ్వాలని, వాటిద్వారా వచ్చిన వడ్డీ తోపాటు, కేంద్రంలో భోజనం చేసేవారి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులతో కేంద్రాలను కొనసాగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటితో 609 మంది మహిళలు లబ్ధి పొందారు.
కేంద్రాల నిర్వహణకు కేటాయించిన బడ్జెట్ అయిపోవడంతో, తాడ్వాయి మండలంలో నాలుగు, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి మండలాలలో మూడేసి కేంద్రాల చొప్పున మొత్తం 13 కేంద్రాలు మూడునెలల క్రితమే మూతపడ్డాయి. ప్రస్తుతం 59 కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇపుడు వీటిని కూడా మూసేసి, అందులో ఉన్న డబ్బులను స్త్రీనిధి ఖాతాలో జమచేయనున్నారు. దీంతో వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వంట సామగ్రి వృథాగా మారనుంది.