రాష్ట్రంలో శాశ్వత కరువునివారణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే........
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల: రాష్ట్రంలో శాశ్వత కరువునివారణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే పెండింగ్‌ప్రాజెక్టులు పూర్తిచేయడంతోపాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జడ్చర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. కరువు మండలాలను ప్రకటించాక ఎలాంటి సహాయక చర్యలు తీసుకోలేదని సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన పై విధంగా వివరణ ఇచ్చారు. కరువుపై కేంద్రానికి నివేదికలు పంపినా ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుందని వివరించారు.
తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత కరువు నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల డిజైన్లను సక్రమంగా చేయకపోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీరు పారాల్సి ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు పారలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల అలా కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఏడాదిలో ఆరునెలల పాటు తీసుకునే వెసులుబాటు ఉందని, అందుకే ముందుగా రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు.
రిజర్వాయర్లు ఉంటే నీటిని నింపుకునే వీలుందని, లేదంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లాగే అవుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మిశంకర్, తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ మున్ని, వైస్ ఎంపీపీ రాములు, సింగిల్‌విండో చైర్మన్లు బాల్‌రెడ్డి, దశరథరెడ్డి పాల్గొన్నారు.