నిర్మల్ : నిర్మల్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఇక్కడి కొయ్యబొమ్మలు. కర్రకు జీవం పోస్తూ సజీవ రూపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఇక్కడి కళాకారుల కృషే. ఇంతటి ఖ్యాతిగాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత ఆదరణ రానున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సైతం
రూపొందిస్తోంది.
విశిష్ట చరిత్ర..
17వ శతాబ్దంలో నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయుడు కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించారు. మొదట కర్రపై చేసిన ఈ కళాకారులు ఆ తర్వాత పొనికి కర్రతో కళాఖండాలను తయారు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మొదట్లో ఎవరికి వారే తయారు చేసుకునే వారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడం, మార్కెట్‌కు ఇబ్బందులు తలెత్తుతుండడంతో 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు.
సహజత్వానికి మారు పేరు...
సహజరూపానికి మారుపేరుగా ఈ బొమ్మలు నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షలు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. ఇక్కడి పేయింటింగ్‌ను డెకో పేయింటింగ్‌తో వేయడం ప్రత్యేకత. అలాగే పేయింటింగ్‌లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
ఈ చిత్రాలు కొన్నేళ్లపాటు శాశ్వతంగా చెక్కుచెదరకుండా ఉంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా 1948లో కళాకారుడు గుండాజివర్మ తయారు చేసి ఇచ్చిన మహారాష్ట్రలోని పాలజ్‌లో ఏటా వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించే వినాయక విగ్రహమేనని చెప్పవచ్చు.
ఆధునికత..
నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు కళాకారులకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను సైతం ఇచ్చారు. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో అందమైన చిన్న బొమ్మలతోపాటు ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించుకునేలా వివిధ వస్తువులను తయారు చేస్తున్నారు. పురుషులతోపాటు మహిళలు కూడా ఇళ్ల వద్ద ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు.
ఆదరణ కల్పించేందుకు ప్రణాళికలు
కొయ్యబొమ్మలకు మరింత ఆదరణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొయ్యబొమ్మలను దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, గుంటూర్ తదితర అన్నీ లేపాక్షి కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, యాక్సెసరీస్ వంటి వాటిని విక్రయించడం చూశాం.
అలాంటి ఈ కామర్స్ సైట్లలో కొయ్యబొమ్మలకు చోటును కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. వైవిద్య హస్తకళలను మంచి ప్యాకింగ్‌తో ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే జరిగితే నిర్మల్ కొయ్యబొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఆదరణ పెరుగనున్నది.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునకు ప్రణాళికలు
Published Sat, Nov 8 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement