E - commerce
-
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్‌తో రూ.18 లక్షలు దోపిడీ
డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పేరుతో స్క్రాచ్ కార్డ్‌లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక
భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం అడుగు పెట్టింది. లిస్బన్ కేంద్రంగా నడిచే జూమ్(Joom) భారత్‌లోని ఎనిమిది నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, ఇండోర్, జైపూర్, సూరత్, రూర్కీ, లుథియానాలలో స్థానిక వ్యాపారులు, ఎగుమతిదారుల కోసం ఒక వేదికను ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 350 మందికిపైగా వ్యాపారులు నమోదు చేసుకున్నారు. వీరిలో సగం మంది డైరెక్ట్ టు కస్టమర్ వ్యాపారాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో విక్రయించలేదు. వారంతా ఇప్పుడు జూమ్ ద్వారా మొదటిసారి అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్, జువెలరీ, క్రిస్టల్ హీలింగ్, హెల్త్ అండ్ బ్యూటీ, హెల్త్ సప్లిమెంట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఉమెన్స్ ఫ్యాషన్, యాక్సెసరీస్ వంటి విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తోన్న ఈ జూమ్ కంపెనీ భారత్‌లో హెల్మెట్లు, కవచాలు, తేనెటీగల పెంపకందారుల ఉత్పత్తులు, గుర్రాలకు జీనులు, వివిధ రకాల రత్నాలు, తివాచీలు, సాంప్రదాయ వస్త్రాల వంటి ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించింది. తాము 2022 ప్రారంభం నుంచే భారత్‌లోని ప్యాపారులతో అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని, ఇందులో పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ టాప్-5 కొత్త కంపెనీలలో ఒకటిగా నిలిచామని కంపెనీ ఆసియా-పసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మాగ్జిమ్ బెలోవ్ తెలిపారు. జూమ్ ఈ-కామర్స్ కంపెనీని 2016లో లాట్వియాలో స్థాపించారు. 2023 నాటికి భారత్ ఈ సంస్థకు టాప్-2 గ్లోబల్ మార్కట్‌గా నిలుస్తుందని, దీని బీటూసీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2023 నాటికి 25.8 శాతం వృద్ధితో 5.57 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గ్రాండ్‌వ్యూ రీసర్చ్ అంచనా వేసింది. ఈ కంపెనీకి ఫార్మా, ఫిన్‌టెక్ , లాజిస్టిక్ వంటి ఈ-కామర్స్ వ్యాపారాలు ఉన్నాయి. 2022 నాటికి ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. -
మరొ లాక్డౌన్ రాక ముందే కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసులు దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏవైనా అంతరాయాలు తలెత్తితే వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2020లో లాక్డౌన్ కారణంగా తయారీ, సరఫరా సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరుకు నిల్వలను పెంచుకుంటున్నాయి. అలాగే సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి. రోజువారీ కోవిడ్–19 కేసులు దేశంలో ఒక లక్ష మార్కును దాటిన సంగతి విధితమే. సమీపంలో నిల్వ కేంద్రాలు.. ఆకస్మికంగా ఏర్పడే స్థానిక లాక్డౌన్, అనిశ్చితి నుంచి గట్టెక్కడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమామి డైరెక్టర్ హర్హ వి అగర్వాల్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, తయారైన, ముడి సరుకు, ప్యాకేజింగ్‌కు ఉపయోగించే పదార్థాలను నిల్వ చేసుకోవడం ద్వారా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నట్టు చెప్పారు. సాధ్యమైనంత వరకు విక్రయ ప్రాంతానికి సమీపంలో నిల్వ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. గతేడాది పాఠాల నేపథ్యంలో సరఫరా సమస్యలను తగ్గించడానికి కాల్ సెంటర్, వాట్సాప్ ద్వారా ఆర్డర్ బుకింగ్స్‌ను పెంచామని డాబర్ ఇండియా సేల్స్ ఈడీ ఆదర్శ్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని పంపిణీదార్లకు, దుకాణాలకు సరఫరాను అధికం చేశామని చెప్పారు. అంచనా వేయలేం.. కిరాణా దుకాణాల కోసం సరుకు నిల్వలను తగిన స్థాయిలో నిర్వహిస్తున్నట్టు మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ అరవింద్ మెదిరట్ట వెల్లడించారు. ఆన్లైన్లో ఆర్డర్లు ఇవ్వడానికి వీలుగా ఈ–కామర్స్ యాప్ సైతం అందుబాటులో ఉందని చెప్పారు. స్థానికంగా లాక్డౌన్స్ ఎప్పుడు, ఎంత కాలం ఉంటాయో అంచనా వేయలేమని, సరఫరా అడ్డంకులూ ఉంటాయని చెప్పలేమని గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ ఇండియా, సార్క్ సీఈవో సునీల్ కటారియా వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు నిల్వలు చేసుకుంటున్నట్టు చెప్పారు. చదవండి: ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఆన్లైన్ జోరు! -
బల్క్ ఎస్ఎంఎస్లపై మూడు రోజుల గడువు
న్యూఢిల్లీ: వినియోగదార్లకు బల్క్ ఎస్ఎంఎస్లు పంపే కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు టెలి మార్కెటింగ్ నిబంధనలకు అనుగుణంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇందుకు మూడు రోజుల గడువు ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. నమోదు చేయని పక్షంలో కస్టమర్లకు వాణిజ్యపర సమాచారం పంపకుండా నిరోధిస్తామని హెచ్చరించింది. అంతేగాక విఫలమైన కంపెనీల పేర్లను తమ వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత కూడా నియంత్రణ సంస్థకు అనుగుణంగా నమోదు కానట్టయితే టెలికం వనరులను ఉపయోగించి పెద్దమొత్తంలో సందేశాలను పంపడానికి వారిని అనుమతించరు. బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్ తదితర కంపెనీలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే.. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే కొత్త నిబంధనలను ట్రాయ్ అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వివిధ సంస్థలు పంపే వాణిజ్యపరమైన ఎస్ఎంఎస్లను వినియోగదారులకు చేరవేయడానికి ముందు.. నిర్దిష్ట నమోదిత సందేశం నమూనాతో టెలికం కంపెనీలు సరిపోల్చి, ధృవీకరించుకోవాలి. ఇందుకోసం టెల్కోలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇందులో నమోదైన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే అధికారికమైనవిగా భావించి సమ్మతించిన కస్టమర్లకు పంపుతాయి. నమోదు చేసుకోని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తాయి. ఈ విధానాన్ని ఎస్ఎంఎస్ స్క్రబింగ్‌గా వ్యవహరిస్తారు. కొత్త విధానంపై పరిశ్రమ వర్గాలకు ఇంకా పూర్తి అవగాహన రాకపోవడంతో సోమవారం నుంచి ఎస్ఎంఎస్లు, ఓటీపీల డెలివరీల్లో సమస్యలు తలెత్తాయి. (చదవండి: భయపడొద్దు.. సెల్ టవర్లు సురక్షితమే) -
‘డిజిటల్’ లాక్డౌన్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ డిజిటల్ చెల్లింపులపైనా ప్రభావం చూపుతోంది. ఆన్లైన్ వాణిజ్యం దాదాపుగా స్తంభించడంతో డిజిటల్ లావాదేవీలు సైతం ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే మార్చిలో డిజిటల్ లావాదేవీలు 43 లక్షల మేర తగ్గిపోయినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 3.50 కోట్ల లావాదేవీలు జరగ్గా మార్చిలో అవి 3.16 కోట్లకు పడిపోయాయి. తాజాగా మే 3 దాకా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఈ నెలంతా డిజిటల్ లావాదేవీలు మరింత పడిపోయే అవకాశాలున్నట్లు బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో తారుమారు.. పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ విస్తృతంగా పేమెంట్ యాప్‌లకు అనుమతులు ఇచ్చింది. తద్వారా బ్యాంకుల భౌతిక లావాదేవీలు చాలా వరకు ఆన్‌లైన్‌కు మళ్లాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి మొదటి వారంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత దేశంలో అక్కడక్కడా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిని మూసేసింది. ఈ క్రమంలో కేంద్రం లాక్డౌన్ ప్రకటించడం నగదురహిత లావాదేవీలు తగ్గుముఖం పట్టేందుకు దారితీసింది. స్తంభించిన ఈ–కామర్స్.. లాక్‌డౌన్‌తో డిజిటల్ లావాదేవీల్లో కీలకంగా చెప్పుకొనే ఈ–కామర్స్ వ్యాపారం పూర్తిగా స్తంభించింది. క్యాబ్, ఫుడ్ యాప్‌లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు హోం డెలివరీ సేవలను నిలిపేయడంతో డిజిటిల్ కార్యకలాపాలకు అవకాశం లేకుండా పోయింది. జనజీవనం స్తంభించడం, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు అధిక శాతం మూతపడటంతో పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల ద్వారా చేసే చెల్లింపులు కూడా లేకుండా పోయాయి. ఆర్థిక సంవత్సరాంతం కావడంతో ఆస్తి పన్ను, ఐటీ, జీఎస్టీ రూపేణా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. ఇందులో అధికంగా ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు దాదాపుగా నిలిచి పోవడంతో ఇలాంటి చెల్లింపులన్నీ వాయిదాపడ్డాయి. దీని ప్రభావం కూడా డిజిటల్ చెల్లింపులపై పడింది. -
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునకు ప్రణాళికలు
నిర్మల్ : నిర్మల్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఇక్కడి కొయ్యబొమ్మలు. కర్రకు జీవం పోస్తూ సజీవ రూపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఇక్కడి కళాకారుల కృషే. ఇంతటి ఖ్యాతిగాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత ఆదరణ రానున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సైతం రూపొందిస్తోంది. విశిష్ట చరిత్ర.. 17వ శతాబ్దంలో నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయుడు కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించారు. మొదట కర్రపై చేసిన ఈ కళాకారులు ఆ తర్వాత పొనికి కర్రతో కళాఖండాలను తయారు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మొదట్లో ఎవరికి వారే తయారు చేసుకునే వారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడం, మార్కెట్‌కు ఇబ్బందులు తలెత్తుతుండడంతో 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. సహజత్వానికి మారు పేరు... సహజరూపానికి మారుపేరుగా ఈ బొమ్మలు నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షలు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. ఇక్కడి పేయింటింగ్‌ను డెకో పేయింటింగ్‌తో వేయడం ప్రత్యేకత. అలాగే పేయింటింగ్‌లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఈ చిత్రాలు కొన్నేళ్లపాటు శాశ్వతంగా చెక్కుచెదరకుండా ఉంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా 1948లో కళాకారుడు గుండాజివర్మ తయారు చేసి ఇచ్చిన మహారాష్ట్రలోని పాలజ్‌లో ఏటా వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించే వినాయక విగ్రహమేనని చెప్పవచ్చు. ఆధునికత.. నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు కళాకారులకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను సైతం ఇచ్చారు. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో అందమైన చిన్న బొమ్మలతోపాటు ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించుకునేలా వివిధ వస్తువులను తయారు చేస్తున్నారు. పురుషులతోపాటు మహిళలు కూడా ఇళ్ల వద్ద ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆదరణ కల్పించేందుకు ప్రణాళికలు కొయ్యబొమ్మలకు మరింత ఆదరణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొయ్యబొమ్మలను దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, గుంటూర్ తదితర అన్నీ లేపాక్షి కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, యాక్సెసరీస్ వంటి వాటిని విక్రయించడం చూశాం. అలాంటి ఈ కామర్స్ సైట్లలో కొయ్యబొమ్మలకు చోటును కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. వైవిద్య హస్తకళలను మంచి ప్యాకింగ్‌తో ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే జరిగితే నిర్మల్ కొయ్యబొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఆదరణ పెరుగనున్నది. -
రూ. 100 కోట్ల పీఈ నిధులు సమీకరిస్తాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: విస్తరణ, కొనుగోళ్లు, విలీనాల దృష్టి అంతా ఈ కామర్స్ కేంద్రంగా సాగుతోంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఆన్లైన్ రిటైల్ వ్యాపారాభివృద్ధికి రూ 6 వేల కోట్లు నిధులు సమీకరించి సంచలనం సృష్టించగా, అమెజాన్ సంస్థ అంతకు రెండింతలు (రూ.12 వేల కోట్లు) భారత్‌లో ఈకామర్స్ వ్యాప్తికి కేటాయించడం ఈ రంగంలో టెంపరేచర్‌ను మరింత పెంచింది. చైనాకు చెందిన జియోమీ సంస్థ కేవలం రెండు సెకన్లలో 15 వేల ఎంఐ3 ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ వేదికగా క్షణాల్లో విక్రయించి కొత్త తరం వ్యాపారానికి తెర లేపింది. దీంతో పాత పద్ధతిలో రిటైల్ వ్యాపారం నిర్వహించే సంస్థలు పోటీలో నిలబడలేకపోతున్నాయి. దాంతో తాము కూడా ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేసుకున్నామని సంగీత మొబైల్స్ మేనేజింగ్ డెరైక్టర్ సుభాష్ చెప్పారు. ప్రస్తుతం సంగీత మొబైల్లో ఆన్లైన్ ఆర్డర్ చేసిన వారికి 47 నిముషాల్లోనే షిప్పింగ్ చేస్తున్నాం. ఈ సమయాన్ని మరింత కుదించేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నామని సుభాష్ చెప్పారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 300కు పైగా మొబైల్ రిటైల్ షాపులను నిర్వహిస్తున్న సంగీత మొబైల్స్ ఉత్తర భారతంలోనూ కొత్త స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండేళ్లలో స్టోర్లను వెయ్యికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుభాష్ తెలిపారు. కొత్త స్టోర్ల ఏర్పాటుకు, ఆన్లైన్ కార్యకలాపాల విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో సంప్రదిస్తున్నామని, రూ. 100 కోట్లు సమీకరించాలన్నది ప్రస్తుత ఆలోచనని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. వెయ్యి కోట్ల టర్నోవర్ దిశగా.. సంగీత మొబైల్స్ టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరానికి తొలిసారిగా రూ వెయ్యికోట్లు దాటనుందని ఆయన తెలిపారు. సగటున నెలకు 1,00,000 మొబైల్ హ్యాండ్సెట్లు విక్రయిస్తున్న సంస్థ గతేడాది (2013-14) టర్నోవర్ రూ. 840 కోట్లుగా నమోదయింది. కౌంటర్ కార్యకలాపాలకు ఆన్లైన్ విక్రయాలు తోడు కావడంతో ఈ ఏడాది 40 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.