రూ. 100 కోట్ల పీఈ నిధులు సమీకరిస్తాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: విస్తరణ, కొనుగోళ్లు, విలీనాల దృష్టి అంతా ఈ కామర్స్ కేంద్రంగా సాగుతోంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారాభివృద్ధికి రూ 6 వేల కోట్లు నిధులు సమీకరించి సంచలనం సృష్టించగా, అమెజాన్ సంస్థ అంతకు రెండింతలు (రూ.12 వేల కోట్లు) భారత్‌లో ఈకామర్స్ వ్యాప్తికి కేటాయించడం ఈ రంగంలో టెంపరేచర్‌ను మరింత పెంచింది.
చైనాకు చెందిన జియోమీ సంస్థ కేవలం రెండు సెకన్లలో 15 వేల ఎంఐ3 ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ వేదికగా క్షణాల్లో విక్రయించి కొత్త తరం వ్యాపారానికి తెర లేపింది. దీంతో పాత పద్ధతిలో రిటైల్ వ్యాపారం నిర్వహించే సంస్థలు పోటీలో నిలబడలేకపోతున్నాయి. దాంతో తాము కూడా ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేసుకున్నామని సంగీత మొబైల్స్ మేనేజింగ్ డెరైక్టర్ సుభాష్ చెప్పారు. ప్రస్తుతం సంగీత మొబైల్‌లో ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన వారికి 47 నిముషాల్లోనే షిప్పింగ్ చేస్తున్నాం. ఈ సమయాన్ని మరింత కుదించేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నామని సుభాష్ చెప్పారు.
కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 300కు పైగా మొబైల్ రిటైల్ షాపులను నిర్వహిస్తున్న సంగీత మొబైల్స్ ఉత్తర భారతంలోనూ కొత్త స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండేళ్లలో స్టోర్లను వెయ్యికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుభాష్ తెలిపారు. కొత్త స్టోర్ల ఏర్పాటుకు, ఆన్‌లైన్ కార్యకలాపాల విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో సంప్రదిస్తున్నామని, రూ. 100 కోట్లు సమీకరించాలన్నది ప్రస్తుత ఆలోచనని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
వెయ్యి కోట్ల టర్నోవర్ దిశగా..
సంగీత మొబైల్స్ టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరానికి తొలిసారిగా రూ వెయ్యికోట్లు దాటనుందని ఆయన తెలిపారు. సగటున నెలకు 1,00,000 మొబైల్ హ్యాండ్‌సెట్లు విక్రయిస్తున్న సంస్థ గతేడాది (2013-14) టర్నోవర్ రూ. 840 కోట్లుగా నమోదయింది. కౌంటర్ కార్యకలాపాలకు ఆన్‌లైన్ విక్రయాలు తోడు కావడంతో ఈ ఏడాది 40 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.