న్యూఢిల్లీ: వినియోగదార్లకు బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపే కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు టెలి మార్కెటింగ్ నిబంధనలకు అనుగుణంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇందుకు మూడు రోజుల గడువు ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. నమోదు చేయని పక్షంలో కస్టమర్లకు వాణిజ్యపర సమాచారం పంపకుండా నిరోధిస్తామని హెచ్చరించింది. అంతేగాక విఫలమైన కంపెనీల పేర్లను తమ వెబ్‌సైట్లో ఉంచుతామని వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత కూడా నియంత్రణ సంస్థకు అనుగుణంగా నమోదు కానట్టయితే టెలికం వనరులను ఉపయోగించి పెద్దమొత్తంలో సందేశాలను పంపడానికి వారిని అనుమతించరు. బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్ తదితర కంపెనీలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే..
మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే కొత్త నిబంధనలను ట్రాయ్ అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వివిధ సంస్థలు పంపే వాణిజ్యపరమైన ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులకు చేరవేయడానికి ముందు.. నిర్దిష్ట నమోదిత సందేశం నమూనాతో టెలికం కంపెనీలు సరిపోల్చి, ధృవీకరించుకోవాలి. ఇందుకోసం టెల్కోలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇందులో నమోదైన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే అధికారికమైనవిగా భావించి సమ్మతించిన కస్టమర్లకు పంపుతాయి. నమోదు చేసుకోని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తాయి. ఈ విధానాన్ని ఎస్‌ఎంఎస్ స్క్రబింగ్‌గా వ్యవహరిస్తారు. కొత్త విధానంపై పరిశ్రమ వర్గాలకు ఇంకా పూర్తి అవగాహన రాకపోవడంతో సోమవారం నుంచి ఎస్‌ఎంఎస్‌లు, ఓటీపీల డెలివరీల్లో సమస్యలు తలెత్తాయి.
(చదవండి: భయపడొద్దు.. సెల్ టవర్లు సురక్షితమే)
Comments
Please login to add a commentAdd a comment