
తుదిదశకు రుణ మాఫీ!
- రెండు రోజుల్లో కొలిక్కి రానున్న జాబితా
- కసరత్తు ముమ్మరంచేసిన యంత్రాంగం
- జిల్లావ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణమాఫీ ప్రక్రియ తుదిదశకు చేరింది. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసేందుకు యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వాస్తవానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాల్సి ఉన్నా బ్యాంకర్లు, అధికారుల మధ్య నెలకొన్న సమన్వయలోపం కారణంగా జాప్యం జరిగింది. గత నెల 29వతేదీ నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో ఉమ్మడిస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి.. 30వ తేదీన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ జాబితాను విడుదల చేయాలి. కానీ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. తాజాగా ఈ జాబితా విడుదలకు సంబంధించి యంత్రాంగం చర్యలను వేగిరం చేసింది. కేటగిరీల వారీగా లబ్ధిదారులను ఏరివేస్తూ తుది జాబితా కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తంగా ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేయనున్నారు.
దశల వారీగా ‘ఏరివేత’
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం.. ఒక కుటుంబానికి సంబంధించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఒక్కో రైతు రెండు, మూడు బ్యాంకుల్లో తీసుకున్న రుణ వివరాలను సేకరిస్తూ.. వాటన్నింటినీ క్రోడీకరించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాఫీ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ముందుగా బ్యాంకుల వారీగా లబ్ధిదారుల వివరాలను మ్యాచ్ చేస్తూ.. మండల స్థాయిలోని అన్ని బ్యాంకుల్లో వివరాలను సరిపోల్చిన అనంతరం జిల్లాస్థాయిలో ఈ వివరాలను క్రోడీకరించి తుది జాబితా తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా నాలుగు దశల్లో చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అర్హులు రెండు లక్షలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం కింద జిల్లాలో రెండు లక్షల మంది లబ్ధిపొందనున్నట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించి ఆరువందల శాఖలున్నాయి. వీటిలో కేవలం 258 శాఖలు మాత్రమే రైతులకు రుణాలు మంజూరు చేశాయి. ఇందులో పంట రుణాల కేటగిరీలో 2.03 లక్షల మందికి రూ.986.59కోట్లు, బంగారు ఆభరణాల రుణ కేటగిరీలో 13వేల మందికి రూ.82.95కోట్లు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే వీరిలో రెండేసి ఖాతాలు ఎంత మందికి ఉన్నాయి.. వాటి పరిమితి ఎంత అనే అంశంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 24 మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, ఒకట్రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తుది జాబితా విడుదల అవుతుందని ఓ అధికారి ‘సాక్షి’కి వివరించారు.