Debt waiver process
-
రెండువారాల్లో రుణమాఫీ
రామన్నపేట( నకిరేకల్ ) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.40 కోట్ల రుణమాఫీ ప్రకియ రెండువారాల్లో పూర్తవుతుందని రాష్ట్ర చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని ఎస్బీఐ, కెనరాబ్యాంక్‌లలో రుణమాఫీ కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా అందిన ప్రతిపాదనల జాబితాను పరిశీలించారు. బ్యాంకు మేనేజర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఆయన స్థానిక మాట్లాడుతూ రాష్ట్రంలో 2010 ఏప్రిల్ 1 నుంచి 2017మార్చి 31 మద్యకాలంలో వివిధ బ్యాంకుల ద్వారా సుమారు 12వేల మంది చేనేత కార్మికులు తీసుకున్న రూ.40కోట్ల రుణాలను మాఫీ చేయుటకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కాలంలో రుణాలు తీసుకుని సక్రమంగా డబ్బులు చెల్లించిన చేనేతకార్మికులకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. రుణమాఫీకి సంబంధించి కలెక్టర్లు అందజేసిన ప్రతిపాదనలను బ్యాంకులవారిగా పరిశీలించే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందన్నారు. పరిశీలన ముగిసిన వెంటనే మాఫీకి సంబంధించిన మొత్లాన్ని బ్యాంకుఖాతాల్లో జమచేయడం జరుగుతుందని వివరించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో రుణమాఫీ ద్వారా 3,653 మంది చేనేత కార్మికులకు సంబంధించి 13.65కోట్ల రుపాయాల రుణాలు మాఫీ అవుతాయన్నారు. రుణాల వసూలుకోసం కార్మికులను ఒత్తిడి చేయవద్దని స్టేట్‌లెవల్ బ్యాంకర్ల సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఆయనవెంట సహాయ అభివృద్ధి అధికారులు కళింగరెడ్డి, చంద్రశేఖర్, సంఘ అధ్యక్షుడు వనం సుధాకర్ ఉన్నారు. -
‘పరిశీలన’ నిబంధనలకు విరుద్ధం
* బంగారం కుదువ పెట్టి అప్పుతీసుకున్న ఖాతాదారులు లేకుండానే.. * అభ్యంతరం చెబుతున్న బ్యాంకు మేనేజర్లు * రుణ మాఫీలో భాగం అంటున్న కోఆర్డినేషన్ కమిటీ మోర్తాడ్: పంట రుణాల మాఫీలో భాగంగా బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ నియమించిన ఆడిటర్లు వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట రుణాల మాఫీకి సంబంధించి వాణిజ్య, సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. గుర్తింపు పొందిన చార్టెడ్ అకౌంటెంట్ల వద్ద శిక్షణ పొందుతున్న అకౌంటెంట్(కాలిబర్)లను ఆడిటర్లుగా కో ఆర్డినేషన్ కమిటీ నియమించింది. బ్యాంకులకు ఆడిటర్లు వెళ్లి పంట రుణం మాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన పహాణి, టైటిల్ డీడ్లను పరిశీలించాలి. అలాగే పంట రుణం పొందడానికి బంగారం కుదువ పెట్టినట్లు అయితే తనఖా ఉన్న బంగారాన్ని పరిశీలించాలి. టైటిల్ డీడ్, పహాణిల పరిశీలన సమయంలో ఖాతాదారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. కుదువ ఉన్న బంగారాన్ని పరిశీలించే సమయంలో మాత్రం సంబంధిత ఖాతాదారు తప్పనిసరిగా ఉండాలి. బంగారాన్ని కుదువపెట్టే సమయంలో నగలు తయారు చేసే వృత్తిదారుడు పరిశీలించి బ్యాంకు అధికారులకు తన ఆమోదాన్ని తెలుపుతాడు. రుణం తీసుకునే ముందు ఖాతాదారు సమక్షంలోనే బంగారాన్ని ఒక పాలిథిన్ కవర్లో ఉంచి సీల్ చేస్తారు. రుణం చెల్లించి బంగారాన్ని ఖాతాదారు తీసుకునే సమయంలో ఖాతాదారు సమక్షంలోనే మళ్లి సీల్ విప్పి బంగారాన్ని ఖాతాదారుకు అందచేస్తారు. ఇప్పుడు ఆడిటింగ్ పేర ఆడిటర్లు బంగారం కుదువ పెట్టిన ఖాతాదారుడు లేక పోయినా సీల్ వేసిన కవర్లను విప్పి పరిశీలిస్తున్నారు. ఖాతాదారులకు సమాచారం ఇవ్వండి జిల్లాలోని ధర్పల్లి మండలం రామడుగు ఎస్బీఐ శాఖతో పాటు పలు గ్రామాలలో ఉన్న బ్యాంకుల శాఖలలోను బంగారు రుణాలకు సంబంధించి బ్యాంకులో కుదువపెట్టిన బంగారాన్ని ఆడిటర్లు పరిశీలించారు. పరిశీలన సమయంలో బంగారం కుదువపెట్టిన ఖాతాదారులు అందుబాటులో లేక పోయినా ఆడిటర్లు కవర్ల సీల్ విప్పి పరిశీలించారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు నోర్లు మూయించినట్లు తెలిసింది. కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించడానికి మోర్తాడ్, జక్రాన్పల్లిలోని జిల్లా సహకార బ్యాంకు శాఖలకు ఆడిటర్లు రాగా ఖాతాదారులకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఆడిటింగ్ చేయాలని మేనేజర్లు స్పష్టం చేశారు. దీంతో ఆడిటర్లు వెనుదిరిగి వెళ్లారు. ఖాతాదారులకు సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రం ఎప్పుడైనా పరిశీలించవచ్చని, కుదువ పెట్టిన బంగారాన్ని మాత్రం ఖాతాదారు సమక్షంలో పరిశీలించాలని కొందరు మేనేజర్లు ఆడిటర్లకు సూచిస్తున్నారు. అయితే రుణ మాఫీ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఆడిటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంగారం కుదువ పెట్టిన సంబంధిత వ్యక్తులు లేకుండా బంగారాన్ని పరిశీలిస్తే అందులో ఏదైనా పొరపాట్లు జరిగితే మేనేజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖాతాదారుల నమ్మకాన్ని కోల్పోతే బ్యాంకుల వ్యవస్థపైనే విశ్వాసం ఉండదని పలువురు మేనేజర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఉన్నతాధికారులు స్పందించి కుదువ పెట్టిన బంగారం పరిశీలన విషయంలో ఆడిటర్లు నిబంధనలు పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
తుదిదశకు రుణ మాఫీ!
- రెండు రోజుల్లో కొలిక్కి రానున్న జాబితా - కసరత్తు ముమ్మరంచేసిన యంత్రాంగం - జిల్లావ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణమాఫీ ప్రక్రియ తుదిదశకు చేరింది. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసేందుకు యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వాస్తవానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాల్సి ఉన్నా బ్యాంకర్లు, అధికారుల మధ్య నెలకొన్న సమన్వయలోపం కారణంగా జాప్యం జరిగింది. గత నెల 29వతేదీ నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో ఉమ్మడిస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి.. 30వ తేదీన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ జాబితాను విడుదల చేయాలి. కానీ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. తాజాగా ఈ జాబితా విడుదలకు సంబంధించి యంత్రాంగం చర్యలను వేగిరం చేసింది. కేటగిరీల వారీగా లబ్ధిదారులను ఏరివేస్తూ తుది జాబితా కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తంగా ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేయనున్నారు. దశల వారీగా ‘ఏరివేత’ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం.. ఒక కుటుంబానికి సంబంధించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఒక్కో రైతు రెండు, మూడు బ్యాంకుల్లో తీసుకున్న రుణ వివరాలను సేకరిస్తూ.. వాటన్నింటినీ క్రోడీకరించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాఫీ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ముందుగా బ్యాంకుల వారీగా లబ్ధిదారుల వివరాలను మ్యాచ్ చేస్తూ.. మండల స్థాయిలోని అన్ని బ్యాంకుల్లో వివరాలను సరిపోల్చిన అనంతరం జిల్లాస్థాయిలో ఈ వివరాలను క్రోడీకరించి తుది జాబితా తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా నాలుగు దశల్లో చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్హులు రెండు లక్షలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం కింద జిల్లాలో రెండు లక్షల మంది లబ్ధిపొందనున్నట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించి ఆరువందల శాఖలున్నాయి. వీటిలో కేవలం 258 శాఖలు మాత్రమే రైతులకు రుణాలు మంజూరు చేశాయి. ఇందులో పంట రుణాల కేటగిరీలో 2.03 లక్షల మందికి రూ.986.59కోట్లు, బంగారు ఆభరణాల రుణ కేటగిరీలో 13వేల మందికి రూ.82.95కోట్లు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే వీరిలో రెండేసి ఖాతాలు ఎంత మందికి ఉన్నాయి.. వాటి పరిమితి ఎంత అనే అంశంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 24 మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, ఒకట్రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తుది జాబితా విడుదల అవుతుందని ఓ అధికారి ‘సాక్షి’కి వివరించారు.