
‘పరిశీలన’ నిబంధనలకు విరుద్ధం
పంట రుణాల మాఫీలో భాగంగా బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ నియమించిన ఆడిటర్లు వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
* బంగారం కుదువ పెట్టి అప్పుతీసుకున్న ఖాతాదారులు లేకుండానే..
* అభ్యంతరం చెబుతున్న బ్యాంకు మేనేజర్‌లు
* రుణ మాఫీలో భాగం అంటున్న కోఆర్డినేషన్ కమిటీ
మోర్తాడ్: పంట రుణాల మాఫీలో భాగంగా బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ నియమించిన ఆడిటర్లు వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట రుణాల మాఫీకి సంబంధించి వాణిజ్య, సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. గుర్తింపు పొందిన చార్టెడ్ అకౌంటెంట్‌ల వద్ద శిక్షణ పొందుతున్న అకౌంటెంట్(కాలిబర్)లను ఆడిటర్లుగా కో ఆర్డినేషన్ కమిటీ నియమించింది. బ్యాంకులకు ఆడిటర్లు వెళ్లి పంట రుణం మాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన పహాణి, టైటిల్ డీడ్‌లను పరిశీలించాలి. అలాగే పంట రుణం పొందడానికి బంగారం కుదువ పెట్టినట్లు అయితే తనఖా ఉన్న బంగారాన్ని పరిశీలించాలి.
టైటిల్ డీడ్, పహాణిల పరిశీలన సమయంలో ఖాతాదారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. కుదువ ఉన్న బంగారాన్ని పరిశీలించే సమయంలో మాత్రం సంబంధిత ఖాతాదారు తప్పనిసరిగా ఉండాలి. బంగారాన్ని కుదువపెట్టే సమయంలో నగలు తయారు చేసే వృత్తిదారుడు పరిశీలించి బ్యాంకు అధికారులకు తన ఆమోదాన్ని తెలుపుతాడు. రుణం తీసుకునే ముందు ఖాతాదారు సమక్షంలోనే బంగారాన్ని ఒక పాలిథిన్ కవర్‌లో ఉంచి సీల్ చేస్తారు. రుణం చెల్లించి బంగారాన్ని ఖాతాదారు తీసుకునే సమయంలో ఖాతాదారు సమక్షంలోనే మళ్లి సీల్ విప్పి బంగారాన్ని ఖాతాదారుకు అందచేస్తారు. ఇప్పుడు ఆడిటింగ్ పేర ఆడిటర్లు బంగారం కుదువ పెట్టిన ఖాతాదారుడు లేక పోయినా సీల్ వేసిన కవర్లను విప్పి పరిశీలిస్తున్నారు.
ఖాతాదారులకు సమాచారం ఇవ్వండి
జిల్లాలోని ధర్పల్లి మండలం రామడుగు ఎస్‌బీఐ శాఖతో పాటు పలు గ్రామాలలో ఉన్న బ్యాంకుల శాఖలలోను బంగారు రుణాలకు సంబంధించి బ్యాంకులో కుదువపెట్టిన బంగారాన్ని ఆడిటర్లు పరిశీలించారు. పరిశీలన సమయంలో బంగారం కుదువపెట్టిన ఖాతాదారులు అందుబాటులో లేక పోయినా ఆడిటర్లు కవర్ల సీల్ విప్పి పరిశీలించారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు నోర్లు మూయించినట్లు తెలిసింది. కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించడానికి మోర్తాడ్, జక్రాన్‌పల్లిలోని జిల్లా సహకార బ్యాంకు శాఖలకు ఆడిటర్లు రాగా ఖాతాదారులకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఆడిటింగ్ చేయాలని మేనేజర్లు స్పష్టం చేశారు. దీంతో ఆడిటర్లు వెనుదిరిగి వెళ్లారు.
ఖాతాదారులకు సంబంధించిన డాక్యుమెంట్‌లను మాత్రం ఎప్పుడైనా పరిశీలించవచ్చని, కుదువ పెట్టిన బంగారాన్ని మాత్రం ఖాతాదారు సమక్షంలో పరిశీలించాలని కొందరు మేనేజర్లు ఆడిటర్లకు సూచిస్తున్నారు. అయితే రుణ మాఫీ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఆడిటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంగారం కుదువ పెట్టిన సంబంధిత వ్యక్తులు లేకుండా బంగారాన్ని పరిశీలిస్తే అందులో ఏదైనా పొరపాట్లు జరిగితే మేనేజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖాతాదారుల నమ్మకాన్ని కోల్పోతే బ్యాంకుల వ్యవస్థపైనే విశ్వాసం ఉండదని పలువురు మేనేజర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఉన్నతాధికారులు స్పందించి కుదువ పెట్టిన బంగారం పరిశీలన విషయంలో ఆడిటర్లు నిబంధనలు పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.