వైద్య కోర్సుల ఫీజు పెంపు | The five-percent increase in medical education courses in the state | Sakshi
Sakshi News home page

వైద్య కోర్సుల ఫీజు పెంపు

Published Fri, Jul 21 2017 1:32 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

వైద్య కోర్సుల ఫీజు పెంపు - Sakshi

వైద్య కోర్సుల ఫీజు పెంపు

బీ, సీ కేటగిరీ సీట్లకు ఐదు శాతం పెంపు
బీ కేటగిరీకి ఎంబీబీఎస్‌ ఫీజు ఏడాదికి రూ.55 వేలు
సీ కేటగిరీకి ఎంబీబీఎస్‌కు రూ.1.10 లక్షలు పెంపు
మైనారిటీ కాలేజీల్లో గత ఏడాది ఫీజులే
బీ, సీ కేటగిరీ సీట్లు కన్వీనర్‌తోనే భర్తీ
కౌన్సెలింగ్‌లో సీట్లు మిగిలితే కాలేజీలకు
నాలుగు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రంలో వైద్య విద్య కోర్సుల ఫీజులు పెరిగాయి. ప్రైవేటు కాలేజీల్లోని బీ, సీ కేటగిరీల ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఐదు శా తం పెంచింది. ఈ మేరకు ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను, ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాలుగు జీవోలు జారీ చేసింది.

ప్రైవేటు కాలేజీల్లోని ఏ కేటగిరీ సీట్ల ఫీజులో ఎలాంటి మార్పులు లేవు. గత ఏడాది ఉన్నట్లుగానే ఏడాదికి రూ.60 వేలుగా ఉంటుంది. ప్రైవేటు కాలేజీల్లోని బీ కేటగిరీ ఎంబీబీఎస్‌ సీటు ఫీజు గత ఏడాది వార్షిక ఫీజు రూ.11 లక్షలు ఉం డేది. ఐదు శాతం పెంపుతో ఇది ప్రస్తుతం రూ.11.55 లక్షలకు చేరింది. సీ కేటగిరీ సీట్ల ఫీజు... బీ కేటగిరీ సీట్ల ఫీజుకు రెట్టింపు స్థాయిలో ఉండాలనే మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ లెక్కన ప్రైవేటు కాలేజీల్లో సీ కేటగిరీ సీటు వార్షిక ఫీజు రూ.23.10 లక్షలు ఉంటుంది. ప్రస్తుత పెంపు వల్ల ఐదేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సు సీ కేటగిరీ సీట్లలో చేరిన వారికి అదనంగా రూ.5.50 లక్షలు ఖర్చు కానుంది.ప్రైవేటు కాలేజీల్లోని బీ కేటగిరీ బీడీఎస్‌ సీట్ల ఫీజు రూ.4 లక్షల నుంచి రూ.4.20 లక్షలకు పెరిగింది.

ఇదే కోర్సులోని సీ కేటగిరీ సీట్ల ఫీజును రూ.5 లక్షల నుంచి రూ.5.25 లక్షలకు పెంచారు.  మైనారిటీ కాలేజీల్లోని 3 కేటగిరీల ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లలో మార్పులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరంలోనూ ఫీజులు ఉంటా యని పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో పోల్చి తే మైనారిటీ కాలేజీల్లో బీ, సీ కేటగిరీల సీట్ల ఫీజు  ఎక్కువగా ఉండడం వల్లే ఈసారి  మార్పులు చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లోని ఏ కేటగిరీ సీటుకు వార్షిక ఫీజు రూ.10 వేలు ఉంది. ఈ ఫీజులోనూ మార్పులు ఉండవు. ఎంబీబీఎస్‌ కోర్సులలో చేరే విద్యార్థులు ఐదేళ్లపాటు  ఫీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్సులో చేరే ముందు ఎంత ఫీజు చెల్లిస్తారో మిగిలిన నాలుగేళ్లు అదే తరహాలో చెల్లింపులు జరపాలని స్పష్టం చేసింది.

ఇదీ కౌన్సెలింగ్‌ తీరు...
ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లోని ఏ, బీ, సీ కేటగిరీ సీట్లు అన్నింటినీ జాతీయ అర్హత ప్రవే శ పరీక్ష(నీట్‌) ర్యాంకుల ఆధారంగా కన్వీనర్‌ భర్తీ చేయనున్నారు. ఏ కేటగిరీ తరహాలోనే బీ, సీ కేటగిరీ సీట్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తు, మెరిట్‌ లిస్ట్, వెబ్‌ కౌన్సెలింగ్‌ ఉంటాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియల్లోనూ ఏ, బీ, సీ కేటగిరీ సీట్లు భర్తీ కాని సందర్భంలో కన్వీనర్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌(మాప్‌ అప్‌ రౌండ్‌) పద్ధతిలో భర్తీ చేస్తారు. ఈ పద్ధతిలోనూ సీట్లు భర్తీకాని పరిస్థితుల్లో కేటగిరీల వారీగా ఖాళీలను పేర్కొం టూ వీటిని భర్తీ చేసే అవకాశాన్ని ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఇస్తారు.

ఏ కేటగిరీలో పేర్కొంటే ఆ మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కన్వీనరు ఆధ్వర్యంలోనే అన్ని సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎంసీఐ మార్గదర్శకాల మేరకు నిర్దేశిత గడువులోపే మూడు కేటగిరీల సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. బీ, సీ కేటగిరీ సీట్లకు నీట్‌ ర్యాంకు సాధించిన అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీపడే అవకాశం ఈసారి ఉంటుంది. ఆగస్టు 31లోపు అన్ని రకాల వైద్య విద్య కోర్సుల ప్రవేశాలను ముగించాలని ఎంసీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగే ప్రవేశాలు చెల్లుబాటుకావని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement