ప్రైవేటుకు ‘సింగరేణి’ ప్లాంట్!
► జర్మన్ కంపెనీ చేతికి జైపూర్ థర్మల్ ప్లాంట్ నిర్వహణ, పర్యవేక్షణ
► జెన్‌కోకు అప్పగించే విషయంలో సింగరేణి వెనకడుగు
► మూడేళ్ల నిర్వహణ కోసం స్టియాగ్ ఎనర్జీతో ఒప్పందం
► అనంతరం స్వయంగా పర్యవేక్షణ చేపట్టనున్న సింగరేణి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) బాధ్యతలను జర్మనీకి చెందిన స్టియాగ్ ఎనర్జీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ సంస్థకు అప్పజెప్పింది. టెండర్ల ద్వారా ఈ కాంట్రాక్టు దక్కించుకున్న స్టియాగ్ ఎనర్జీతో సింగరేణి యాజమాన్యం తాజాగా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కోకు అప్పగించాలని భావించినా... ఇటీవల జెన్‌కో పనితీరు దెబ్బతినడం, విద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం షరతులు పెట్టిన కారణంగా.. ప్రైవేటు సంస్థవైపు సింగరేణి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జైపూర్‌లో 1,200 మెగావాట్ల (రెండు 600 మెగావాట్ల యూనిట్లు) థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి చేపట్టిన విషయం తెలిసిందే. తొలిసారిగా విద్యుదుత్పత్తి రంగంలో అడుగుపెట్టిన సింగరేణికి విద్యుత్ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణలో అనుభవం లేదు. దీంతో ప్రాజెక్టు బాధ్యతలను స్టియాగ్‌కు అప్పగించింది.
వచ్చే నెల 1వ తేదీ నుంచి మూడేళ్ల పాటు స్టియాగ్ సంస్థ నిర్వహణ, పర్యవేక్షణలో సింగరేణి ప్లాంటులో విద్యుదుత్పత్తి జరగనుంది. ఆ తర్వాత విద్యుత్ ప్లాంట్ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను స్వయంగా చేపట్టాలని సింగరేణి భావిస్తోంది. నిర్వహణ, పర్యవేక్షణ అవసరాల కోసం ఆలోగా ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని నియమించుకోనుంది. స్టియాగ్ ఎనర్జీ సంస్థ ప్రస్తుతం ఒడిశాలో 2,400 (4ఁ600) మెగావాట్ల వేదాంత థర్మల్ ప్లాంట్, 1,050 (2ఁ525) మెగావాట్ల హిందుజా థర్మల్ ప్లాంటు నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని, అందుకే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని సింగరేణి అధికార వర్గాలు పేర్కొన్నాయి.
జెన్‌కోను కాదని...
విద్యుదుత్పత్తి రంగంలో విశేష అనుభవమున్న రాష్ట్ర విద్యుత్ సంస్థ(జెన్‌కో)కే జైపూర్ విద్యుత్ ప్లాంట్ బాధ్యతలు అప్పగించాలని సింగరేణి యాజమాన్యం భావించింది. రెండు సంస్థల మధ్య ప్రాథమిక స్థాయిలో సమాలోచనలు సైతం జరిగాయి. ఆ ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ నిమిత్తం జెన్‌కో ఇటీవల దాదాపు 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసుకుంది కూడా. కానీ చివరకు ప్రైవేటు కంపెనీల వైపే సింగరేణి యాజమాన్యం మొగ్గు చూపింది. అయితే ఇటీవలి కాలంలో జెన్‌కో తన సొంత కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో ఆపసోపాలు పడింది. ప్రారంభించిన కొద్దిరోజులకే 600 మెగావాట్ల కేటీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రం మరమ్మతులకు వచ్చింది. దీంతోపాటు జైపూర్ ప్లాంట్ నిర్వహణ కోసం జెన్‌కో షరతులు విధించడంతో ప్రైవేటు కంపెనీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని సింగరేణి వర్గాలు వెల్లడించాయి. సొంత విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత ఒత్తిడి నేపథ్యంలో జెన్‌కో సంస్థే వెనక్కి తగ్గిందని మరో అధికారి పేర్కొనడం గమనార్హం.
30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఈ నెల 30న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలని సింగరేణి భావిస్తోంది. ఇందుకోసం ప్రాజెక్టు పైలాన్‌తో పాటు హెలిప్యాడ్‌ను సైతం సిద్ధం చేసింది. ప్రాజెక్టులో 600 మెగావాట్ల తొలి యూనిట్ సింక్రనైజేషన్ ఇప్పటికే పూర్తయింది. మరో 600 మెగావాట్ల రెండో యూనిట్ సింక్రనైజేషన్‌ను ఈనెల 20-25 తేదీల మధ్య పూర్తి చేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెలలో రెండు యూనిట్ల నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంపై అధికారికంగా స్పందించేందుకు సింగరేణి వర్గాలు నిరాకరించాయి.