
174 దుకాణాలు.. 850 దరఖాస్తులు..
ఆదిలాబాద్ క్రైం : కొత్త రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లాలో 174 మ ద్యం దుకాణాలకు 850 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులకు లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఎలాగైనా మద్యం దుకణాలు దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు ఈసారి భారీగా పోటీ పడుతున్నారు. ఈనెల 23న జిల్లా కేంద్రంలోని పి.జనార్దన్‌రెడ్డి గార్డెన్‌లో కలెక్టర్ సమక్షంలో మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా కేటాయించనుండడంతో వ్యాపారులు తమ అదృష్టాన్నే నమ్ముకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకోవాలనే కుతుహాలంతో ఉన్నారు. మొదటి నుంచి మద్యం షాపులు నిర్వహిస్తున్నవారు ఈసారి కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే.. కొంత మంది సిండికేట్ ద్వారా మద్యం దుకాణాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్రస్తుతం దరఖాస్తులు గడు వు ముగిసినా షాపు కేటాయించిన తర్వాతైనా సిండికేట్ అయ్యేందుకు వెనకాడడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.
చివరి రోజు బారులు..
ఈనెల 16 నుంచి మందకొడిగా సాగిన టెండర్ దరఖాస్తులు చివరి రోజు శనివారం ఊపందుకున్నాయి. జిల్లాలోని మంచిర్యాల యూనిట్ పరిధిలో 104 దుకాణాలు, ఆదిలాబాద్ యూనిట్ పరిధిలో 70 దుకాణాలు ఉన్నాయి. మొత్తం 174 దుకాణాలకు 850 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దరఖాస్తుదారులు బారులు తీరారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, మంచిర్యాల యూనిట్ పరిధిలోని స్టేషన్‌ల వారీగా కౌంటర్‌లను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తుదారులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ సిబ్బంది రాత్రి వరకూ వాటిని లెక్కపెట్టారు.