ప్రజల గుండెల్లో వైఎస్‌ది చెరగని ముద్ర: కొండా
నర్సంపేట : నిరుపేద, పేద కుటుంబాలకు చెందిన ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అం దించిన సేవలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి కొండా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ అకాల మరణం చెందారని తెలుసుకుని గుండెపగిలి చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్ తనయుడు, వైఎస్సార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇచ్చిన హామీలో భాగంగా ఆయన సోదరి షర్మిల ఈ నెల 7 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారని వివరించారు.
ఆమె జిల్లాలోని జనగాం మీదుగా పాలకుర్తి నియోజకవర్గానికి చేరుకొని ఎడ వెంకన్న కుటుంబాన్ని మొదట పరామర్శిస్తారని చెప్పా రు. 7న 6 కుటుంబాలు, 8న 7 కుటుంబాలు, 9న 4 కుటుంబాలు, 10న 7 కుటుంబాలు, 11న 5 కుటుంబాలను పరామర్శిస్తారని వెల్లడించారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరంగల్ జిల్లాకు వస్తుండగా.. కొంతమంది అడ్డుకుంటున్నారనే సమాచారంతో మనస్తాపానికి గురై గుండె పగిలి నర్సంపేటలో మృతి చెందిన ఎల్లయ్య కుటుంబాన్ని సైతం నాలుగో రోజు షర్మిల పరామర్శిస్తారని తెలిపారు.