విచారణకు సహకరించడం లేదు
► ముసద్దీలాల్ ఎండీ తదితరులపై హైకోర్టుకు పోలీసుల నివేదన
► లోతుగా విచారణ జరపాల్సి ఉందని వినతి
► ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలన్న న్యాయస్థానం
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రక టన వెలువడిన వెంటనే భారీ ఎత్తున బం గారం విక్రయించినట్లు దొంగ రసీదులు సృష్టించి రూ.100 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొం టున్న ముసద్దీలాల్ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లు విచారణకు సహ కరించడం లేదని పోలీసులు బుధవారం ఉమ్మడి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో లోతైన విచారణ చేపట్టి వాస్త వాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి స్పందించిన హైకోర్టు, ఏం చేసినా సీఆర్‌పీసీ సెక్షన్ 41ను అనుస రించే చేయాలని పోలీసులకు స్పష్టం చేస్తూ దీనిపై విచారణను ముగించింది. ఈ మేర కు న్యాయమూర్తి రాజా ఇలంగో ఉత్తర్వు లు జారీ చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం ముసద్దీలాల్ యాజమాన్యం 5,200 తప్పుడు రసీదులను సృష్టించి భారీ స్థాయిలో బంగారం విక్రయించినట్లు చూపి పాత నోట్లను మార్పిడి చేసిందని, తద్వారా రూ.100 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీ సులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు సీసీఎస్ పోలీసులకు బదిలీ అయింది. తమపై కేసు నమోదు చేయడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీలను జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ముసద్దీలాల్ ఎండీ, ఇతరులు హైకోర్టును ఆశ్రయించిన విష యం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసులు అడిగిన ప్రశ్న లన్నింటికీ పిటిషనర్లు సమాధానాలు ఇచ్చారని తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. అయితే ఈ వాదనలను హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ తోసిపుచ్చారు. విచార ణకు ఎంత మాత్రం సహకరించడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.