ఏపీ కొత్త బ్యారేజీపై డీపీఆర్ వచ్చాకే చెప్పగలం: కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై 1.7టీఎంసీల సామర్థ్యంతో ఏపీ నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) వచ్చాకే దాని సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వగలమని కృష్ణా బోర్డు కేంద్రానికి స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం దీనిపై బోర్డు వివరణ కోరింది.
ఈ నేపథ్యంలో బోర్డు తన వివరణను శుక్రవారం కేంద్రానికి పంపింది. ‘ఈ బ్యారేజీకి సంబంధించి డీపీఆర్‌ను ఏపీ తయారు చేయలేదు. అది లేకుండా బ్యారేజీ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వలేం. అదీగాక కృష్ణాపై మరో బ్యారేజీ అంటే ఇది అంతర్రాష్ట్ర వ్యవహారాల పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎలాంటి కొత్త ప్రాజెక్టు చేపట్టినా దానికి సీడబ్ల్యూసీ, మా అనుమతి తీసుకోవాలి’ అని కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి రాసిన లేఖలో బోర్డు పేర్కొంది.