సమస్యల గురుకులం!
♦ గురుకుల పాఠశాలల్లో వసతుల లేమి
♦ మంజూరు ఒకచోట.. నిర్వహణ మరోచోట
♦ చాలాచోట్ల అద్దె భవనాల్లోనే కొనసాగింపు
♦ సంఖ్యకు అనుగుణంగా గదుల్లేక ఇబ్బందులు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపహాడ్‌లోని మూతబడిన ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకొని దామరచర్ల మండలానికి, నాగార్జునసాగర్ నియోజకవర్గం తుమ్మడం గ్రామానికి మంజూరైన బీసీ బాలికల గురుకులాలను నడుపుతున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో మూడు గురుకులాలు ఏర్పాటు చేశారు. మొత్తం 240 సీట్లకు ఇప్పటివరకు 190 మంది మాత్రమే అడ్మిషన్ పొందారు. సిబ్బంది కొరతతోపాటు దుస్తులు, మంచాల పంపిణీ లేకపోవడంతో విద్యార్థినులు ప్రవేశాలకు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది మంజూరైన ఆరు గురుకుల పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉంది. జిల్లాకు నాలుగు బీసీ, రెండు మైనార్టీ గురుకులాలు మంజూరయ్యాయి. నాగారం, నేరేడుచర్లలో బీసీ బాలుర హాస్టల్స్.. సింగిరెడ్డిపాలెం, అనంతగిరి బీసీ బాలికల గురుకుల పాఠశాలలు.. హుజూర్‌నగర్, తుంగతుర్తిలో మైనార్టీ బాలుర హాస్టళ్లు ప్రారంభించారు. ఇందులో నాగారం గురుకులాన్ని అర్వపల్లిలో, సింగిరెడ్డిపాలెం గురుకులాన్ని సూర్యాపేటలో, అనంతగిరి గురుకుల పాఠశాలను కోదాడలో నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో నిర్వహిస్తున్న సింగిరెడ్డిపాలెం బాలికల గురుకుల పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉండగా మూడు తరగతి గదులు, నాలుగు హాస్టల్ గదులు మాత్రమే ఉన్నాయి. టాయిలెట్లు ఆరు మాత్రమే ఉండటంతో ప్రతిరోజు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి, నెట్‌వర్క్: గురుకులాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహా సంగా ప్రారంభించిన గురుకులాలు తొలి ఏడాది ఒడిదొడు కులను ఎదుర్కొంటున్నాయి. ఎక్కడా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో నడుపుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ యూనిఫాం అందలేదు.
పలుచోట్ల నీటి వసతి లేక ఇబ్బందులు పడుతుండగా.. అద్దె భవనాల్లో స్నానాల గదులు, టాయిలెట్స్ లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ఒక్క బోధన, భోజనం విషయంలో మాత్రం అన్ని చోట్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నెలలో నాలుగు రోజులు చికెన్, రెండ్రోజులు మటన్‌తో కూడిన భోజనం, ప్రతిరోజు గుడ్డు, అల్పాహారంగా పూరి, నూడుల్స్, ఇడ్లీ ఇవ్వడంతోపాటు సాయంత్రం చిరుతిళ్లనూ అందించాల్సి ఉంది. అయితే ఇందుల్లో కొన్ని ఐటమ్స్ మిస్ అవుతున్నా.. మొత్తంగా గురుకులాల్లో భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా గురుకులాలు..
పది జిల్లాల్లో కలిపి కేవలం 221 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం వాటి సంఖ్యను మూడింతలు పెంచేసింది. 2017– 18 విద్యా సంవత్సరంలో 170 బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీలకు సంబంధించి 654 గురుకులాలు ప్రారంభమయ్యాయి.
సరిపోని గదులు.. నేలపైనే నిద్ర
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు అందుబాటులో లేవు. అద్దెకు తీసుకున్న భవనాలు ఇరుగ్గా ఉండటంతో గదుల సంఖ్యను కూడా తగ్గించుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రెండు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేనిచోట మరో భవనాన్ని వెతుకుతున్నామని అధికారులు చెబుతున్నారు. తరగతి గదుల్లోకి ఫర్నీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. విద్యార్థులు పడుకునేందుకు బెడ్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న చాపలు వేసుకుని నేలపైనే నిద్రిస్తున్నారు.
టాయిలెట్లు.. అతిపెద్ద సమస్య
అనుకున్న సమయానికి గురుకులాలను ప్రారంభించి విద్యాబోధన చేయించడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. వసతుల లేమిపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు స్నానాల గదుల్లో 40 మంది విద్యార్థులు స్కూల్ సమయానికి ముందే స్నానాలు చేసి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్ల సంఖ్య తక్కువ ఉండటం ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది.
హాస్టళ్ల గదులూ అరకొరే..
తరగతులు ప్రారంభం కాకముందే విద్యార్థుల సంఖ్య తెలిసినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో వసతి కల్పించలేకపోయారు. ఒక్కో పాఠశాలలో చేరిన 180 మంది విద్యార్థులకు నాలుగు గదులే అందుబాటులో ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచి వస్తున్నారు. మిగతా వారు ఇరుకు గదుల్లోనే ఉంటున్నారు. చిన్న గదుల్లో 40 నుంచి 50 మంది ఉండాల్సి వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇక విద్యార్థులకు దుస్తులు కూడా ఇంకా ఇవ్వలేదు.