
అమల్లోకి కొత్త భూసేకరణ చట్టం
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
► ఇక భూసేకరణ వేగవంతం
► 36 ప్రాజెక్టుల పరిధిలో 96 వేల ఎకరాల సేకరణకు మార్గం సుగమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ పునరావాసం పునఃపరిష్కారంలో న్యాయమైన పరిహారం, పారదర్శకమైన హక్కు (తెలంగాణ సవరణ)–2016 బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం బుధవారమే ప్రభుత్వానికి అందింది. దీంతో వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణలో జాప్యాన్ని నివారించి బాధితులకు తక్షణ పరిహారం అందించేందుకు ప్రభుత్వం బిల్లును రూపొందించింది.
గత ఏడాది డిసెంబర్ 28న బిల్లును అసెంబ్లీ, మండలి ఆమోదించాయి. అయితే బిల్లుకు సవరణలు సూచిస్తూ కేంద్రం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపింది. కేంద్రం చెప్పిన స్వల్ప సవరణలు చేసేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. గతనెల 30న ప్రత్యేకంగా ఉభయ సభలను సమావేశపరిచి సవరణలను ఆమోదించింది. అనంతరం కేంద్రం కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి గత శనివారం రాజముద్ర వేసి రాష్ట్రానికి పంపారు. దీంతో బిల్లు చట్టంగా మారింది. దీని ద్వారా ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల కోసం జరిపే భూసేకరణ ఇక సులభతరం కానుంది. బాధితులకు సకాలంలో న్యాయమైన పారదర్శకమైన పరిహారం లభిస్తుంది. ఈ చట్టంతో 36 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సి 96 వేల ఎకరాల భూసేకరణకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
చట్టంలోని ముఖ్యాంశాలివీ..
► కేంద్ర భూసేకరణ చట్టం–2013తో పాటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 123 జీవోలోని అంశాలే ఎక్కువగా ఈ కొత్త చట్టంలో ఉన్నాయి
► 2014 జనవరి 1 నుంచి ఈ చట్టం ప్రకారం భూసేకరణ అమల్లోకి వస్తుంది
► 2013 చట్టంలోని సామాజిక ప్రభావం, ప్రజా ప్రయోజన నిర్ధారణకు చేపట్టే ప్రాథమిక విచారణ అధ్యాయాన్ని తొలగించారు. దీంతో సామాజిక ప్రభావ మదింపు, పరిశోధన లేకుండానే భూసేకరణ చేపట్టే అధికారం రాష్ట్రం సొంతమవుతుంది
► ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే భూసేకరణకు ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్.. భూ యజమానితో సంప్రదింపులు జరిపి అమ్మకం ధర ఖరారు చేసుకుంటారు. దాని ప్రకారం గెజిట్ జారీ చేస్తారు. దాంతో నిర్వాసిత భూ యజమానుల హక్కులు ప్రభుత్వానికి ధారాదత్తమవుతాయి
► ఆ భూములు ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ అవుతాయి
► ఖరారు చేసుకున్న ధర ప్రకారం సహాయ పునరావాస, పరిహార మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి
► నిర్వాసితులకు అక్రమంగా డబ్బు చెల్లించినట్లు గుర్తిస్తే భూమి శిస్తు తరహాలో తిరిగి వసూలు చేసుకుంటారు
► ప్రభావిత కుటుంబాల జాబితాలో ఉన్న వ్యవసాయాధారిత కూలీలకు తగిన పరిహారం చెల్లిస్తారు.