షి‘కారు’ ఎలా..?
- ఎన్నికల వేళ గ్రేటర్ టీఆర్‌ఎస్‌లో సంక్షోభం
- పార్టీని వీడిన కట్టెల,దోసోజు, కాచం
- కారు జోరుకు బ్రేకులు
- బరిలోకి దిగిన అభ్యర్థుల్లో టెన్షన్
సాక్షి,సిటీబ్యూరో: మరో పదహారురోజుల్లో ఎన్నికలుండగా గ్రేటర్ టీఆర్‌ఎస్‌లో సంక్షోభం నెలకొంది. కీలక సమయంలో పార్టీ గెలుపునకు మార్గదర్శనం చేయాల్సిన పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, పోలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్, ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జీ కాచం సత్యనారాయణ సహా పలువురు ద్వితీయశ్రేణి నాయకులు కాంగ్రెస్ పంచన చేరడంతో కారు జోరుకు బ్రేకులు పడుతున్నారు.
తెలంగాణ ఏర్పాటుతో జోష్‌లో ఉన్న పార్టీలో..ఈ పరిణామమంతో షి‘కారు’ ఎలా అని ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యమస్ఫూర్తితో పనిచేయాల్సిన పార్టీ నాయకగణం, కేడర్ అప్పుడే డీలా పడడంతో బరిలోకి దిగిన నేతలు కలవరపడుతున్నారు.
ఎలక్షన్ సమయంలో ముఖ్యనాయకులు పార్టీని వీడడం,టికెట్ల కేటాయింపులో సీనియర్లను పక్కనబెట్టడం,మహానగరాభివృద్ధిని ప్రతిబింబించే లా మేనిఫెస్టో లేకపోవడం,ఉద్యమకారులను,జేఏసీ నాయకులను విస్మరించడం,సొంతబలంపై నమ్మకం లేక ఇతర పార్టీల నేతలను నమ్ముకోవడం వంటి అంశాలన్నీ పార్టీకి చేటు చేస్తాయని పార్టీ వర్గాలు కుండబద్దలు కొడుతున్నారు. ఈ ప్రతికూల పరిణామం పార్టీపై ఆశలు పెట్టుకున్న పది నియోజకవర్గాలపైనా తప్పక ప్రభావం చూపుతాయని అవి చెబుతున్నాయి. గ్రేటర్‌వ్యాప్తంగా జనంనాడిని తెలుసుకొని ప్రచారం చేసేందుకు ప్రచారకర్తలు సైతం లేకపోవడం కూడా పార్టీకి శాపంగా పరిణమిస్తోందన్నది ఆ వర్గాల భావన.
ప్రతినియోజకవర్గంలో సెటిలర్లఓట్లు కీలకంగా మారడం, ఎనిమిది స్థానాల్లో ఎంఐఎం బలంగా ఉండడం,పార్టీలో నెలకొన్నసంస్థాగత లోపాలు, కిందిస్థాయి కేడర్‌కు సరైన దిశానిర్దేశం లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రతికూలంగా మారినట్లు ముఖ్యనాయకులు సైతం వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ముగిసేవరకు గ్రేటర్ అధ్యక్షపీఠంలో ఎవరినీ కూర్చోబెట్టరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగీ వర్సెస్ కారు : పొత్తు ప్రతిపాదన లు ఆదిలోనే వికటించి ఒంటరిపోరుకు సిద్ధమైన కాంగ్రెస్,టీఆర్‌ఎస్‌లు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ముమ్మరయత్నాలు చేస్తుండడంతో రాజకీయం రంజుగా మారుతోంది. ఒకపార్టీ నుంచి మరొక పార్టీకి నేతల వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టికెట్లు దక్కక కొందరు,అధినాయకత్వం ఒంటెత్తు పోకడలు,కుటుంబపాలన నచ్చక మరికొందరు వెంటనే గోడ దూకేస్తున్నారు. అధినాయకత్వం ఇప్పటికైనా కళ్లుతెరచి అసంతృప్త నేతలను బుజ్జగించే యత్నం చేయకుంటే ఎన్నికల వేళ పార్టీకి నష్టమేనని పార్టీవర్గీయులు స్పష్టంచేస్తున్నారు.